తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రాత్రివేళ ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. సోమవారం తెల్లవారుజామున సగటు కనిష్ట ఉష్ణోగ్రత 15.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంతేకాకుండా హైదరాబాద్ నగర శివారులోని శేరిలింగంపల్లిలో అతి తక్కువగా 11.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రిపోర్టు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) అంచనా ప్రకారం.. రానున్న రెండు మూడు రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్ శివార్లలోని కాప్రా, హయత్‌నగర్, ఉప్పల్, మలక్‌పేట్, ఫలక్‌నుమా వంటి ప్రాంతాల్లో మంగళ, బుధ, గురువారాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టవచ్చని వాతావరణ అధికారులు అంచనా వేశారు.
హైదరాబాద్ లో రాత్రి ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.. 15 డిగ్రీల సెల్సియస్ నుండి 11 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే చాన్స్ ఉందని తెలిపారు. భయంకరమైన చలిగాలుల నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 10.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రానున్న రెండు రోజుల్లో మేడ్చల్- మల్కాజిగిరి, నిర్మల్, జనగాం, సిద్దిపేట, వికారాబాద్ సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల దాకా తగ్గే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో నమోదైన ఉష్ణోగ్రతలు..
శేరిలింగంపల్లి – 11.9 డిగ్రీల సెల్సియస్
రాజేంద్ర నగర్ – 13.2 డిగ్రీల సెల్సియస్
పటాన్ చెరు – 13.8 డిగ్రీల సెల్సియస్
హయత్‌నగర్ – 14.4 డిగ్రీల సెల్సియస్
సికింద్రాబాద్ – 14.4 డిగ్రీల సెల్సియస్