Saturday, November 23, 2024

Russia-Ukraine War: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన వంటనూనె ధరలు

దేశంలో వంట నూనెల ధరల భగ్గుమంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో నూనె ధరలు పెరుగుతున్నాయి. అన్ని రకాల వంటనూనెల ధరలు లీటర్‌కు రూ.20కి పైగా పెరిగాయి. జనవరిలో సన్‌ఫ్లవర్‌ నూనె లీటర్‌ ధర రిటైల్‌ మార్కెట్‌లో రూ.134 ఉండగా ఇప్పుడు రూ.157కు పెరిగింది. అన్ని నూనెల కన్నా పామాయిల్‌ ధర గరిష్ఠంగా రూ. 29 పెరిగింది.

వంటనూనెల వినియోగంలో మనదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. దేశీయ అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తి జరగడం లేదు. దేశానికి అవసరమయ్యే నూనెల్లో 90 శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి అవుతోంది. దేశం దాదాపు 74శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఉక్రెయిన్ నుంచే దిగుమతి చేసుకుంది. అంతేకాకుండా సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడంలో మొదటి స్థానంలో ఉంది. భారత్ లో పామ్ ఆయిల్ తరువాత ఎక్కువగా వాడేది సన్ ఫ్లవర్ ఆయిల్. దేశంలో నూనె గింజల సాగు దేశ అవసరాలను తీర్చే విధంగా లేదు. ఏటా రూ.70 వేల కోట్ల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. భారత్ కు వచ్చే పామాయిలో 70 శాతం పైగా ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచే దిగుమతి అవుతోంది. దీని కారణంగా పామాయిల్ ఆయిల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి.

 రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కొనసాగితే లీటర్‌ ధర రూ.200 దాటిన ఆశ్చర్యపోనవసరం లేదని నూనెల కంపెనీల ప్రతినిధులు, చెబుతున్నారు. ఒకవేళ యుద్ధం ముగిసినా మరో నెల పాటు ధరల పెరుగుదల కొనసాగుతుందని భావిస్తున్నారు. వరుసగా నూనెల ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పలువురు వ్యాపారులు స్టాక్‌ను బ్లాక్‌ చేస్తున్నారు. ముందు జాగ్రత్తలో భాగంగా చిన్న దుకాణాదారులు, వినియోగదారులు అధిక మొత్తంలో నూనెలను కొనుగోలు చేస్తున్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement