కాలుష్యానికి మారు పేరులా మారిపోయింది యమునా నది. మరోసారి యమునా నది పేరు మారుమోగుతోంది. కాగా కార్తీకమాసం ప్రారంభం అయింది. పవిత్ర నదుల్లో మహిళలు స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. మంచులా కనపడుతోన్న తెల్లనిదంతా విషపు నురగ. నాలుగు రోజుల ఛత్‌పూజ వేడుకల్లో భాగంగా పుణ్యనదుల్లో ఒకటైన యమునా నదిలో భక్తులు పుణ్యస్నానమాచరిస్తారు. అయితే, కాలుష్యమయంగా యమునా నది మారడం, పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలుస్తుండంతో విషపు నురగలు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి.అయినా సరే భక్తులు ఆ విషపు నురగల మధ్యే పుణ్యస్నానాలాచరించాల్సి వస్తోంది.
ఢిల్లీలోని కాళింది కుంజ్ లో నిన్న, ఈ రోజు మహిళలు పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. యమునా నదిలో ఎంత ప్రమాదకర స్థాయిలో కాలుష్య కారకాలు ప్రవహిస్తున్నాయో తెలుసుకుని నదీమ తల్లిని ఆరాధించే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ నీళ్లలో స్నానాలు చేస్తే అనేక రోగాలూ ప్రబలుతాయని నిపుణులు తెలిపారు. ఢిల్లీలోని కాళింది కుంజ్ లోని యమునా ఘాట్‌లో స్నానమాచరించిన ఓ మహిళ తాజాగా మీడియాతో మాట్లాడుతూ… యమునా నది మురికిమయం అయిపోయిందని తమకు తెలుసని, అందులో ప్రమాదకర స్థాయిలో విషపూరిత వ్యర్థాలు చేరాయని తెలిపింది. అయినప్పటికీ, సూర్య భగవానుడికి పూజలు చేయాలంటే అందులో పుణ్యస్నానాలు ఆచరించకతప్పదని చెప్పింది. కాగా, నదులను పరిరక్షించాలని, శుద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.