నదిలోని అలలపై తేలియాడూ కొట్టుకొచ్చిన ప్లాస్టిక్ బాక్సుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఇవి బంగ్లాదేశ్‌కు అక్రమంగా రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మొబైల్ ఫోన్లను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని లోధియా అవుట్ పోస్ట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. నిన్న (శనివారం) సాయంత్రం అరటి బోదెలకు కట్టిన ప్లాస్టిక్ కంటైనర్లు పాగ్లా నదిలో బంగ్లాదేశ్ వైపు ప్రవహిస్తున్నాయి. బీఎస్‌ఎఫ్ జవాన్లు వీటిని గమనించారు. వెంటనే ఆ ప్లాస్టిక్ బాక్సులను ఒడ్డుకు తెచ్చి తెరిచి చూశారు. అందులో పలు కంపెనీలకు చెందిన 317 మొబైల్ ఫోన్లున్నాయి.
దీంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ మొబైల్ ఫోన్ల విలువ దాదాపు 40 లక్షల దాకా ఉంటుందని బీఎస్‌ఎఫ్ అధికారి తెలిపారు. అక్రమ రవాణాపై దర్యాప్తు కోసం స్థానిక పోలీసులకు వాటిని అప్పగించినట్లు చెప్పారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య స్మగ్లింగ్‌ను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు బీఎస్‌ఎఫ్ చురుకుగా వ్యవహరిస్తున్నదని 70వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ తెలిపారు. దీంతో అక్రమార్కులు అక్రమ రవాణా కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారని వెల్లడించారు.