వచ్చే మూడేళ్లలో కనీసం పది అణువిద్యుత్ కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అణువిద్యుత్ కేంద్రాల నిర్మాణం చాలా జాగ్రత్తగా, దశలవారీగా నిర్మించాల్సి ఉంటుంది. భారత్‌లో ఈ కేంద్రాల నిర్మాణం మరింత జాప్యంతో కూడుకుని ఉంటాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వడివడిగా (ఫ్లీట్ మోడ్) కొత్త అణువిద్యుత్ కేంద్రాల పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. కేవలం నిర్ణయంతో సరిపెట్టలేదు… ఆ విధానంలో ఇప్పటికే పనులు మొదలుపెట్టేసింది కూడా. అణువిద్యుత్ కేంద్రాల నిర్మాణంలో తొలిదశ పనులను ఫస్ట్ పోర్ ఆఫ్ సిమెంట్ (ఎఫ్‌పీసీ)గా పరిగణిస్తారు. కర్ణాటకలోని కైగాలో 2023నాటికి నిర్మించదలచిన 700 మెగావాట్ల అణువిద్యుత్ కేంద్రంలో రియాక్టర్ల పనుల్లో ఈ ఎఫ్‌పీసీ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. ప్రత్యేకించి ఇందులోని 5,6 యూనిట్లలో ఈ పనులు పూర్తయ్యాయి. ఇది కాక వచ్చే మూడేళ్లలో మరో అణువిద్యుత్ కేంద్రాలను కూడా ఇదే విధానంలో సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గోరఖ్‌పూర్(యూపీ), హర్యా అణువిద్యుత్ పరియోజన్‌లో 3,4 యూనిట్లు, బన్స్వారా రాజస్థాన్ ఆటమిక్ పవర్ ప్రాజెక్టులోని 1,4 యూనిట్ల ఎఫ్‌పీసీ పనులు 2024నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు.
అలాగే ఛుత్కా మధ్యప్రదేశ్ ఆటమిక్ పవర్ ప్రాజెక్టులోని 1,2 యూనిట్ల ఎఫ్‌పీసీ 2025నాటికి పూర్తి చేయనున్నట్లు కేంద్ర అణుశక్తి శాఖ అధికారులు పార్లమెంటరీ కమిటీ ( సైన్స్ అండ్ టెక్నాలజీ)కి నివేదించారు. బిలాల తవ్వకంతో పాటు ప్రాథమిక పనులు చేపట్టడాన్ని ఎఫ్‌పీసీగా పిలుస్తారు. దేశంలో దేశీయ పరిజ్ఞానంతో 700 మెగావాట్ల సామర్థ్యం గల పది అతిభారజల అణు రియాక్టర్లను నిర్మించేందుకు కేంద్రప్రభుత్వం 2017లోనే అనుమతి ఇచ్చింది. వీటి నిర్మాణానికి దాదాపు రూ.1.05 లక్షల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇన్ని అణువిద్యుత్ కేంద్రాలను ఒకేసారి, అతివేగంగా నిర్మించాలనుకోవడం ఇదే ప్రథమం. ఈ కేంద్రాల నిర్మాణానకి అవసరమైన 40 స్టీమ్ జనరేటర్లు, ఎస్‌ఎస్ 304ఎల్ లట్టీస్ ట్యూబులు, ప్లేట్లు, పైకప్పులు, బ్లిdడ్ కండెన్సర్లు, ఇంకొలోయ్ ట్యూబ్‌లు పరికరాలు, సాంకేతికత సమీకరించే చర్యలు ఇప్పటికే ప్రారంభమైనాయి. ఖర్చు తగ్గించే లక్ష్యంతోనే ఈ కేంద్రాలను ఫ్లీట్ మోడ్‌లో పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ విధానం ప్రకారం ఎఫ్‌పీసీ ప్రక్రియ తర్వాత ఒక్కో అణువిద్యుత్ కేంద్రం పనులు కేవలం ఐదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో 22 అణు రియాక్టర్లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీటివల్ల 6780 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. గుజ రాత్‌లోని కాక్రాపూర్‌లోని 700 మెగావాట్ల సామర్థ్యంగల అణువిద్యుత్ కేంద్రాన్ని గత ఏడాది జాతీయ గ్రిడ్‌కు అనుసంధానించారు. అతిభారజల కేంద్రాల్లో (అణువిద్యుత్ కేంద్రాలు) యురేనియంను ఇంధనంగాను, భారజలాన్ని ఉత్ప్రేరకంగాను వినియోగిస్తారు.