Saturday, November 23, 2024

Politics: నియోజ‌క‌వ‌ర్గం మార‌నున్న సీఎం కేసీఆర్‌.. ఈసారి పోటీ న‌ల్గొండ నుంచేనా?

తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేయడం లేదా? ఆయ‌న పార్ల‌మెంట్‌కు పోటీ చేస్తున్నారా? అంటే అవున‌నే అంటున్నారు చాలామంది పార్టీ లీడ‌ర్లు. ఇట్లాంటి ప్ర‌చారం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే దిశగా అడుగులేస్తున్న సీఎం కెసిఆర్‌ పార్లమెంట్‌కు పోటీ చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ రెండు సార్లు గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అంతకు ముందు ఆయన సిద్దిపేట నుంచి పోటీ చేసేవారు. ఇప్పుడా స్థానం నుంచి హరీశ్‌ రావు పోటీ చేస్తున్నారు. గజ్వేల్ నుంచి గెలిచిన రెండు సార్లు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక‌.. ఈ సారి ఆయన నియోజకవర్గం మారబోతున్నట్లుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

కేసీఆర్ కూడా ఈ అంశంపై క్లారిటీగా ఉన్నారని అంటున్నారు పార్టీ లీడ‌ర్లు. అయితే.. గజ్వేల్ నుంచి రెండు సార్లు పోటీ చేస్తే రెండు సార్లూ కూడా వంటేరు ప్రతాప్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఓ సారి టీడీపీ తరపున.. మరోసారి కాంగ్రెస్ తరపున ప్ర‌తాప్‌రెడ్డి పోటీ చేశారు. రెండుసార్లూ ఆయన గెలిచేస్తారన్నంతగా పోటాపోటీ నెల‌కొంది. కానీ, ఇప్పుడు ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సారి కేసీఆర్‌కు బదులుగా టీఆర్ఎస్ తరపున వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీచేస్తారని ఈ మేరకు నియోజకవర్గంలో పని చేసుకోవాలని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. గజ్వేల్‌లో మంచి పట్టు ఉన్న ప్రతాపరెడ్డి ఈ మ‌ధ్య కాలంలో నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు.

అయితే ఈ ప్రచారం నిజమో.. వ్యూహమో కానీ, దీనివల్ల టీఆర్ఎస్‌ శ్రేణులు కూడా ఈ సారి కేసీఆర్ నియోజకవర్గం మారడం ఖాయమని గుస‌గుస‌లాడుతున్నాయి. కేసీఆర్ ఎంచుకునే నియోజకవర్గాల్లో నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం పేరు కూడా ప్రాథ‌మికంగా వినిపిస్తోంది. ప్రస్తుతం మెదక్‌ నుంచి టీఆర్‌ఎస్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈసారి లోక్‌సభకు కాకుండా దుబ్బాక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారన్న విష‌యం కూడా ప్ర‌చారంలో ఉంది. జాతీయ రాజకీయాలకు వెళ్లినా కేసీఆర్ క‌చ్చితంగా ఎమ్మెల్యేగా బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. కేసీఆర్ పోటీ చేయకపోవడం అనే సమస్య ఉండదు. గజ్వేల్ కాకపోతే మరి ఏ నియోజకవర్గం అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ అధినేత ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇంకా స్పష్టత రావాల్సి ఉంద‌ని కొంత‌మంది పార్టీ లీడ‌ర్లు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement