దేశాన్ని కరోనా మహమ్మారికి వెంటాడుతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ కలవర పెడుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది బ్లాక్ ఫంగస్ బారిన పడి చనిపోయారు. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది. ఆదివారం బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్- బీ ఇంజెక్షన్లు భారత్‌కు చేరుకున్నాయి. మొత్తం 2 లక్షల డోసులు వచ్చాయి. ఈ మేరకు అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
మ్యుకర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) వ్యాధి చికిత్సలో యాంఫోటెరిసిన్ బీ మందు వాడుతారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారు దీని బారిన పడుతున్నారు. స్టైరాయిడ్లు ఎక్కువగా వాడే వారికి బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్టైరాయిడ్లను వైద్యుల సూచన మేరకే తీసుకోవాలని చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ సోకినవారిలో కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబారడం, నొప్పి తలెత్తడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి అందకపోవడం, రక్తవాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.