కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 14న హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో జరిగే పరివర్తన్ ప్రతిజ్ఞ మహా ర్యాలీ –బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా ఆమె పార్టీ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో బహిరంగ సభలో ఆమె ప్రసంగించడం ఇదే తొలిసారి. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (HPCC) అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు బహిరంగ సభ తేదీని పోస్ట్ చేసింది. ఈ ర్యాలీ ద్వారా ప్రియాంక గాంధీ హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి అధికారికంగా నాంది పలుకుతుందని ఆ ట్విట్టర్లో పార్టీ తెలిపింది.
ఇక.. మాజీ సీఎం వీరభద్ర సింగ్ గతేడాది చనిపోయారు. ఈ నేపథ్యంలో HPCC అధ్యక్షురాలిగా ఉన్న ఆయన భార్య, ఎంపీ ప్రతిభా సింగ్ ఇప్పుడు సోలన్ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు. ప్రియాంక గాంధీ ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌లో అక్టోబర్ 4 నుండి సిమ్లాలోని ఛరాబ్రాలోని తన నివాసంలో ఉన్నారు. ఆమెతో పాటు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఉన్నారు. సోనియా గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం సిమ్లాలో ఉన్నట్లు సమాచారం.
కాగా, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ) అక్టోబర్ 14న ఢిల్లీలో సమావేశం కానుంది. ఇప్పటికే 45 మంది అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. ఏది ఏమైనప్పటికీ సిమ్లా, ధర్మశాలతో సహా ఎనిమిది కీలకమైన స్థానాల్లో పోటీ జరుగుతోంది. ఇక్కడ వాటిని కాపాడుకోవాలని పార్టీ భావిస్తోంది.