Wednesday, November 6, 2024

8న ప్రియాంకా గాంధీ చేతుల మీదుగా కాంగ్రెస్ యూత్ డిక్లేరేష‌న్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సరూర్‌నగర్‌ స్టేడియం వేదికగా 8వ తేదీన నిర్వహించ నున్న సభకు ”యువ సంఘర్షణ సభ”గా నామకరణం చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ సభలో కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ యూత్‌ డిక్లరేషన్‌, ఎన్నికల మేనిఫెస్టోనూ విడుదల చేస్తారని తెలిపారు. విద్యా ర్థులు, నిరుద్యోగులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఎలా ఆదుకుం టామో యూత్‌ డిక్లరేషన్‌లో ఉంటాయని ఆయన వివరించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ… టీఎస్‌పీఎస్సీ, యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వాలని కేసీఆర్‌ను అడగటం కాదని, కేసీఆర్‌, కేటీఆర్‌ ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. వాటిని భర్తీ చేయకుండా ఆర్భాటపు ప్రకటనలు చేస్తోందని ఆయన విమర్శించారు. చివరకు టీఎస్‌పీస్సీ ప్రశ్నా పత్రాలు సంతలో సరుకులుగా మార్చేశారని ఆయన ధ్వజమెత్తారు. రూ.వందల కోట్లకు లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను తాకట్టు పెట్టారని ఆయన ఘాటుగా విమర్శించారు. కేసీఆర్‌పై కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న పోరాటానికి నిరుద్యోగులు, విద్యార్థులు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. ఈ నెల 8న సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే యువ సంఘర్షణ సభకు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

శరద్‌ మర్కట్‌కు రూ.1.50 లక్షల వేతనంతో ప్రయివేట్‌ ఉద్యోగిగా నియామకం
మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ విస్తరణ కోసం తెలంగాణ ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్‌ దుర్వినియోగం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతుంటే.. మహారాష్ట్రకు చెందిన శరద్‌ మర్కట్‌ అనే యువకుడికి సీఎంవోలో రూ.1.50 లక్షలతో ప్రయివేట్‌ సెక్రటరీగా నియమించారని ఆయన ఆరోపించారు. శరద్‌ మర్కట్‌ను నియమిస్తూ మే 2న జీవో ఇచ్చిందని, అందుకు సంబంధించిన జీవో 647ను ప్రభుత్వం రహస్యంగా ఉంచారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ జీవోలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత అల్లాడుతుంటే పరాయి రాష్ట్రంలో పరపతి పెంచుకోవడం కోసమే అక్కడి మనుషులను ఇక్కడికి తెచ్చుకుని ఉద్యోగాలు ఇస్తున్నారని రేవంత్‌రెడ్డి మండపడ్డారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శరద్‌ మర్కట్‌ 20రోజుల క్రితం బీఆర్‌ఎస్‌లో చేరారని, ప్రజల సొమ్ముతో ఆయనకు ఏడాదికి తెలంగాణ ప్రజల సొమ్ముతో రూ.18 లక్షల వేతనం ఇస్తున్నారని ఆయన తెలిపారు. మహారాష్ట్ర నుంచి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారనే ప్రచారం బూటకమని, కిరాయి మనుషులను తెప్పించుకుని కండువాలు కప్పుతున్నారని ఆయన తెలిపారు.

హనుమాన్‌ చాలీసాకు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం కాదు..
కాంగ్రెస్‌ పార్టీ హనుమాన్‌ చాలీసాకు వ్యతిరేకం కాదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు గాంధీభవన్‌ వస్తే అందరం కలిసి హనుమాన్‌ చాలీసా చదువుకుందామని రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. బీజేపీ నేతలు ఎంఐఎంతో కలిసిపోయారని విమర్శించారు. సచివాలయంలో నల్లపోచమ్మ ఆలయాన్ని కేసీఆర్‌ కూల్చి వేస్తే బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కర్ణాటకలోని 40శాతం కమీషన్ల దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఇలాంటి నినాదాలు చేస్తోందన్నారు. బీజేపీని కర్ణాటకలో గెలిపించేందుకే తెలంగాణ సీఎం కేసీఆర్‌ డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. కర్ణాటకలో హంగ్‌ వస్తే బీజేపీ, జేడీఎస్‌ల మధ్య సమోధ్య కుదుర్చడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తారని ఆయన ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీని ఓడించాలనుకుంటే.. మీడియా సమావేశం పెట్టి బీజేపీని ఓడించాలని ఎందుకు చెప్పడం లేదని ఆయన నిలదీశారు. ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే భయంతోనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌ కార్యాలయం ముందు ఆందోళనలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హిందుత్వ ముసుగులో రాజకీయాలు చేయడం సరికాదని, కాంగ్రెస్‌ పార్టీ అన్ని మతాలు, వర్గాలను ఆదరిస్తుందని తెలిపారు.

నిరుద్యోగులకు మద్దతుగానే ప్రియాంక వస్తున్నారు: మాణిక్‌రావు ఠాక్రే
రాష్ట్రంలోని విద్యార్థి, నిరుద్యోగులకు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికి మద్ధతుగా ఉంటుందని చెప్పడానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాష్ట్రానికి వస్తున్నారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే అన్నారు. నిరుద్యోగుల పట్ట తెలంగాణ ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకే యువ సంఘర్షణ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిరుద్యోగులకు భరోసా కల్పించి వారిలో నమ్మకాన్ని కలిగిస్తామన్నారు. సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

- Advertisement -

యువ సంఘర్షణ సభ లోగో ఆవిష్కరణ
సరూర్‌నగర్‌ స్టేడియంలో 8న నిర్వహించే ‘యువ సంఘర్షణ సభ’ పోస్టర్‌ను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి తదితరులు కలిసి స్టేడియంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. అంతకు ముందు స్టేడియాన్ని పార్టీ నేతలు సందర్శించారు. యువ సంఘర్షణ సభ విజయంతం కోసం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్‌ ఆఫైర్స్‌ కమిటీతో పాటు పార్టీ అనుబంధ సంఘాల నాయులతోనూ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మాణిక్‌రావు ఠాక్రేలు సమావేశం నిర్వహించి.. జన సమీకరణలో ప్రతి నాయకుడు భాగస్వామ్యం కావాలని సూచించారు.

ఏడు పార్లమెంట్‌ నియోజక వర్గాలకు ఇన్‌చార్జుల నియామకం..
యువ సంఘర్షణ సభను విజయవంతం చేసేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏడు పార్లమెంట్‌ నియోజక వర్గాలకు ఇన్‌చార్జులను నియమించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, భువనగిరి, మల్కాజ్‌గిరి, మెదక్‌, మహూబ్‌నగర్‌ పార్లమెంట్‌తో పాటు నల్లగొండ పార్లమెంట్‌ నియోజక వర్గాల పరిధిలోని అసెంబ్లిd నియోజక వర్గాల నుంచి జన సమీకరణ ఎక్కువగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సభ విజయవంతానికి అసెంబ్లిd నియోజక వర్గాలకు బాధ్యులను నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement