ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవమైన పనితీరుపై చర్చించేందుకు CWC – ఆదివారం సమావేశం కానుంది.
పంజాబ్ లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్.. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీకి కనీస పోటీ ఇవ్వలేక పోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకులే.. పార్టీ నాయకత్వంపై బహిరంగంగానే విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై అంతర్మథనంలో పడింది. ఓటమికి గల కారణాలపై చర్చించడానికి నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్యూసీ ) సమావేశం కానుంది. ఐదు రాష్ట్రాల్లో ఘోర పరాజయంపై చర్చించనున్నారు. ఇదే సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రధాన అజెండాగా కనిపిస్తోంది.
అలాగే, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతోపాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు.
కాగా, CWCలో కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడుతోపాటు 23 మంది ఇతర సభ్యులు ఉంటారు. వీరిలో 12 మంది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC)చే ఎన్నుకోబడినవారు. CWC చివరిగా 2021 అక్టోబర్‌లో సమావేశమైంది.