హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీలో ‘ వార్ రూం’ పంచాయతీ రచ్చ కెక్కింది. యూత్ కాంగ్రెస్ వార్ రూం నుంచి
టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు ట్రోల్ చేసిన అంశంపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చగా మారింది. సొంత పార్టీ నేతలపైనే వ్యతిరేక పోస్టులు చేయడంపైన పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుని.. వార్ రూమ్ ఇన్‌చార్జ్ ప్రశాంత్‌పై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకున్నది. ప్రశాంత్ వెనక పార్టీ నేతలు ఎవరున్నారనే అంశంపైన అధిష్టానం ఆరా తీస్తున్నది. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో ఈ వార్ రూం నడుస్తోంది. తనపై కొందరు వ్యక్తులు వ్యతిరేక పోస్టులు ట్రోల్ చేస్తూ దుష్పచారం చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవలనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి బంజారాహిల్స్‌లోని యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూం పైన సీసీఎస్ పోలీసులు దాడులు చేసి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వార్ రూమ్ ఇన్‌చార్జ్ ప్రశాంత్‌తో పాటు మరో నలుగురుపైన పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని బుధవారం విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఇదిలా ఉండగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్తల సునీల్ కనుగోలు ఆఫీసుపైన పోలీసులు దాడులు జరిపిన సమయంలోనూ.. తనపై సొంత పార్టీ నేతలే దుష్పచారం చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన సమావేశంలోనూ ఈ అంశం ప్రధాన చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా యూత్ కాంగ్రెస్ వార్ రూం విషయంలోనూ ఇదే తరహా ఆరోపణలు రావడం హాట్ టాపిక్ మారుతోంది. సొంత పార్టీ నేతలకు డ్యామేజ్ జరిగేలా హస్తం పార్టీలో కుట్ర జరుగుతోందన్న ఆరోపణలు రావడం ఇప్పుడు కాంగ్రెస్‌లో సంచలనంగా మారుతోంది.