కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నది బీజేపీ నినాదం. అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్‌ను సాగనంపి, ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ కమలం వికసిస్తోంది. అడపాదడపా ఎదురుదెబ్బలు తగులుతున్నా నెమ్మదిగా పైచేయి సాధిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ చేష్టలుడిగి చూస్తోంది. యూపీఏ రెండు దఫాల పాలనలో దేశంలో సగానికిపైగా రాష్ట్రాలు, ప్రత్యేకించి పెద్ద రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు తన చరిత్రలో ఎన్నడూ లేని స్థితికి దిగజారిపోయింది. ప్రస్తుతం జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో సంపూర్ణ పరాజయమే. ఇక కాంగ్రెస్ చేతిలో మిగిలింది కేవలం రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలే. తమిళనాడులో డీఎంకే మిత్రపక్షంగా కాంగ్రెస్ కొనసాగడం తప్ప మరెక్కడా కాంగ్రెస్‌కు చోటు లేకపోయింది. ఏఐసీసీ సారథి సోనియాగాంధీ క్రియాశీలంగా లేకపోవడం, రాహుల్ గాంధీ అపరిపక్వత, ప్రియాంక గాంధీ ఒంటరి పోరాటం ఈ దుస్థితికి కారణాలుగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్‌ను కాంగ్రెస్సే ఓడిస్తుందన్న పంజాబ్ పీసీసీ సారథి నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పినట్టు కాంగ్రెస్ పతనానికి ఆ పార్టీ నేతలే కారణం.
ఘోర పరాభవం
సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కు ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ పరాభవం తప్పలేదు. ప్రత్యేకించి పంజాబ్‌లో అధికారం నిలబెట్టుకోలేకపోయింది. పాతకాలపు మూస వ్యూహాలు, అంత: కలహాలను పరిష్కరించలేకపోవడం, అధిష్టానం అచేతనత్వం పతనానికి ప్రధాన కారణాలు. చరిష్మా ఉన్న అమరీందర్ సింగ్‌ను సాగనంపడం, సిద్దూను కట్టడి చేయలేకపోవడం, చన్నీ దళిత కార్డ్ ప్రయోగం వంటివి ఏవీ పంజాబ్‌లో పనిచేయలేదు. అటు యూపీలో ఎంత శ్రమించినప్పటికీ ప్రియాంక గాంధీ ప్రభావం చూపలేకపోయారు. ఒకటీ అరా సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. గోవా, మణిపూర్, ఉత్తరాంఖండ్లలోనూ పేలవ ప్రదర్శనే చేసింది. రాహుల్ సారథ్యంలో రెండు సార్వత్రిక ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చూసింది. ఇక ఆశలన్నీ ప్రియాంక గాంధీపై పెట్టుకున్నారు. కానీ యూపీ, పంజాబ్‌లలో ఆమె ప్రభావం ఏమీ కన్పించలేదు. కాంగ్రెస్ ఓట్ షేర్ యూపీలో ఈ సారి సింగిల్ డిజిట్‌కు వచ్చేసింది. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లోను ఓటమిపాలయ్యారు. ఆయన మంత్రివర్గ సహచరుల్లో చాలామందికి పరాభవం తప్పలేదు. పీసీసీ సారధి సిద్దూకూ అపజయం ఎదురైంది. అమరీందర్ సింగ్‌ను బయటక పంపడంలో, చన్నీకి నిత్యం తలనొప్పులు తెస్తూ వచ్చిన సిద్దూ కాంగ్రెస్ ఓటమికి పరోక్ష కారకుడు.
2011లో హవా
ఇప్పటికీ దేశంలో 20 శాతం నిర్ణీత ఓటుబ్యాంకు ఉన్న కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసేవారు లేక చతికిలపడుతోంది. 2011నాటికి దేశంలోని 11 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 2013 నాటికి మరో రెండు రాష్ట్రాలలో అధికారం కైవసం చేసుకుంది. సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాక కాంగ్రెస్‌కు పూర్వవైభవం వచ్చిందని అందరూ మురిసిపోయారు. 2011లో రాజస్థాన్, ఢిల్లిd, హర్యానా, మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీ, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, మణిపూర్, మిజోరంలలో అధికారంలో ఉంది. 2012లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో అధికారం కైవసం చేసుకుంది. యూపీయే రెండో దఫా సమయంలో ఏఐసీసీ సారథిగా సోనియా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు పార్టీ పరిస్థితి గొప్పగానే ఉంది.
మోడీ రాకతో మారిన దృశ్యం
జాతీయ రాజకీయాల్లోకి నరేంద్రమోడీ వచ్చీరాగానే అందుకున్న నినాదం కాంగ్రెస్ ముక్త్ భారత్, అనువంశిక పాలనకు వ్యతిరేకంగా బీజేపీ రాజకీయ పోరాటం ప్రారంభించింది. ఆ సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. యూపీయే రెండో దఫా తరువాత మొదలైన పతన పరంపర ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. రాహుల్, ప్రియాంక జోడీ ఎత్తులు మోడీ జిత్తుల ముందు పనిచేయడం లేదు.
2013లో కాంగ్రెస్ కర్నాటకలో గెలిచింది. రాజస్థాన్‌లో ఓటమి. అదే ఏడాది జరిగిన మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో
పేలవ ప్రదర్శన
2014లో మహారాష్ట్ర, ఢిల్లిd, హర్యానాలలో ఘోరంగా ఓటమి పాలైంది.
2015లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, కేరళ, ఐదు ఈశాన్య రాష్ట్రాలలో అధికారం
2016లో అసోం, కేరళలో ఓటమి
2018లో మిజోరం, మేఘాలయలలో అధికారం కోల్పోయింది
2019లో సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం
2021లో పుదుచ్చేరి, అసోం, కేరళ, ప.బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో నామమాత్రపు ప్రభావం. తమిళనాడులో డీఎంకే మిత్రపక్షం