లక్నో : యూపీలో బికినీ భామ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రముఖ మోడల్, నటి అర్చనా గౌతమ్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని బీజేపీ తప్పుబట్టింది. అయితే కాషాయ నేతల ఆరోపణలను హస్తం పార్టీ ఖండించింది. కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేకపోవడంతో.. చౌకబారు ప్రచారాల కోసం ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చిందని యూపీ బీజేపీ నేత రాకేశ్ త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు అవకాశం ఇవ్వడం వెనుక ప్రజాసేవ అనే భావనే లేదని విమర్శించారు. హస్తినాపూర్ నుంచి అర్చనా టికెట్ దక్కించుకుంది. బీజేపీ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది.
అర్చనా ఓ కళాకారిణి అని, ఆమె రాజకీయాల్లోకి రావాలని అనుకోవడంలో తప్పేముందని ప్రశ్నించింది. బీజేపీలోనూ చాలా మంది నటులు ఉన్నారని చెప్పుకొచ్చింది. మేరఠ్‌లోని హస్తినాపూర్ నుంచి అర్చనా (26) టికెట్ అందుకుంది. బికినీ భామగా యూపీ వాసులకు పరిచయమైంది. గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాతో 2015లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి.. హసీనా పార్కర్, బరోటా కంపెనీ చిత్రాల్లో నటించింది. 2018లో జరిగిన అందాల పోటీల్లో మిస్ బికినీ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. మేరఠ్‌లోని పార్థాపూర్‌లో అర్చన నివాసం ఉంటుంది. బుల్లితెరపై కూడా ఓ వెలుగువెలిగింది.