Friday, November 22, 2024

హుజురాబాద్ బైపోల్.. కాంగ్రెస్ కు సెంటిమెంట్ ఫియర్!

తెలంగాణలో ఆసక్తి రేపుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు ప్రణాళికులు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ సెంటిమెంట్ వెంటాడుతోంది. దాదాపు 38 ఏళ్లుగా కాంగ్రెస్ ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన దాఖలాలు లేవు. 1983 నుండి హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఎవరూ విజయం సాధించలేదు. ఈ స్థానం నుండి కాంగ్రెసేతర అభ్యర్ధులే గెలుపొందుతున్నారు. ప్రస్తుతం జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి కోసం కాంగ్రెస్ నేతలు అన్వేషిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి కౌశిక్ రెడ్డికి 60 వేలకు పైగా ఓట్లు దక్కాయి. ఈ దఫా కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.  

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. త్వరలోనే ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. టీఆర్ఎస్ నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అభ్యర్ధిని ఆ పార్టీ బరిలోకి దింపే అవకాశం ఉంది. గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. దీంతో కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది.

అయితే హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు 1983 నుండి కాంగ్రెసేతర పార్టీ అభ్యర్ధులనే గెలిపిస్తుండడం హస్తం నేతలను కలవర పెడుతోంది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1972లో కాంగ్రెస్ అభ్యర్ధి వొడితెల రాజేశ్వరరావు, 1978లో కాంగ్రెస్ అభ్యర్ధి దుగ్గిరాల వెంకటరావులు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు ఎవరూ కూడ విజయం సాధించలేదు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధి కొత్త రాజిరెడ్డి గెలుపొందారు. ఈ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభంజనం సృష్టించింది. 1983లో దుగ్గిరాల వెంకటరావు టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. 1989లో ఇండిపెండెంట్ అభ్యర్ధి కేతిరి సాయి రెడ్డి విజయం సాధించారు. 1994, 1999 ఎన్నికల్లో ఈ స్థానం నుండి మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ అభ్యర్ధిగా గెలుపొందారు. ఆయన చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ ప్రభంజనంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు.

2004 నుండి 2018 ఎన్నికల వరకు ఈ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. 2004లో ఈ స్థానం నుండి మాజీ మంత్రి కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెలుపొందారు. 2008లో జరిగిన ఉపఎన్నికల్లో కూడా కెప్టెన్ లక్ష్మీకాంతరావు గెలుపొందారు. అయితే, 2009లో నియోజకవర్గాల పునర్విజన కారణంగా హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. అంతకుముందు ఆయన కమలాపూర్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. 2009 నుండి 2018 వరకు హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెలుపొందుతున్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో ఆయన హుజురారాబాద్ నుంచి విజయం సాధించారు. ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈసారి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచారు. ఈ క్రమంలో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీల మధ్యే ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఈదఫా కూడా ఓటమి పాలవుతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే ‘’ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, అదొక ప్రక్రియ… ఆ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని తమ కార్యక్రమాలు, కార్యాచరణలు ఉండవు’’ అని పీసీసీ చీఫ్‌ రేవంత్ ఇటీవల వ్యాఖ్యానించారనే టాక్ వివిపిస్తోంది. ఉప ఎన్నికలో గెలిచినా.. ఓడినా.. కాంగ్రెస్ కు వచ్చిన నష్టం ఏమీ లేదని హస్తం నేతలు అంటున్నారు. తమ లక్ష్యం అంతా కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికలేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆరు సార్లు అక్కడి నుంచి గెలిచిన ఈటలను ఢీకొట్టడం పెద్ద సవాలే. అందులోని టీఆర్ఎస్ పార్టీకి హుజురాబాద్ కంచుకోట. ఈ క్రమంలో గత అనుభవాల దృష్ట్యా బైపోల్ లో ఓటమిని కాంగ్రెస్ ముందే అంగీకరించిందనే టాక్ వినిపిస్తోంది.

ఇది కూడా చదవండిః త్వరలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ.. దళిత వర్గానికి డిప్యూటీ సీఎం పదవి!

Advertisement

తాజా వార్తలు

Advertisement