Friday, November 22, 2024

కాంగ్రెస్ సీనియర్ల దళిత సిఎం స్వరం – రేవంత్ కు చెక్ పెట్టే వ్యూహం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ పార్టీ అంటేనే నాయకుల మధ్య కలహాలు, విబేధాలు, మనస్ఫర్థలకు మొదటి నుంచి నిలయంగా ఉంటుంది. ఒక రోజు నాయకులు విమర్శలు చేసుకోవడం, మరుసటి రోజు కలిసి ఉన్నట్లుగా ప్రజల ముందు నటించడం కూడా సహజంగానే కనిపిస్తాయి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లోనూ అదే సీన్‌ కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో ఏకచత్రాధిపత్యం ఉండకుండా.. మరో పవర్‌ సెంటర్‌ను పార్టీ సీనియర్లు ముందుకు తీసుకొస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఒక వైపు టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి పార్టీ అధిష్టానం పూర్తి స్వేచ్ఛను ఇస్తూనే.. మరో వైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అంతే స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తూ తెరమీదకు తీసుకొస్తోందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అందుకు ‘ పీపుల్స్‌ మార్చ్‌ ‘ పాదయాత్రలో భాగంగా మంచిర్యాలలో నిర్వహించిన భారీ బహిరంగ సభనే ఉదాహరణగా చెబుతున్నారు. అంతే కాకుండా ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే రావడంతో పాటు, రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్లు కూడా ఉత్సాహంగా కనిపించడం జరిగింది. సభలో మాట్లాడిన వక్తలందరు దళిత వాదాన్నే ముందుకు తీసుకురావడం కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో దళిత వర్గాలకు చేసిందేమీ లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దళిత సీఎం హామీ, మూడు ఎకరాల భూ పంపిణీ ఏమైంది..? పోడు భూముల సమస్యతో పాటు కేసీఆర్‌ మంత్రి వర్గంలో సామాజిక న్యాయం కొరవడిందంటూ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర విమర్శలు చేయడం కనిపించింది. మంచిర్యాలలో నిర్వహించిన భారీ బహిరంగా సభ నిర్వహణ, ఖర్గే హాజరు తదితర అంశాలు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రమేయం లేకుండానే జరిగిపోయాయనే చర్చ కూడా కాంగ్రెస్‌ వర్గాల్లో సాగుతోంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే మొదటి సీఎం దళితుడేనని హామీ ఇచ్చి దళిత వర్గాలను మోసం చేశారని విమర్శిస్తున్నామని, అదే కాంగ్రెస్‌లో దళిత సీఎం నినాదం ఎందుకు తీసుకోవద్దనే చర్చ జరుగుతోంది. ఈ నినాదంతో టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి దూకుడుకు చెక్‌ పెట్టొచ్చనే ఆలోచనతో సీనియర్‌ నాయకులు ఉన్నట్లుగా సమాచారం.

కాగా, ఇంతకు ముందు టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన బహిరంగ సభల్లో పార్టీ సీనియర్లు మొక్కుబడిగా వచ్చి ప్రసగం చేసి వెళ్లే వారని, ఇప్పుడు అందుకు భిన్నంగా మంచిర్యాల సభలో పార్టీ సీనియర్‌ నాయకులు కనిపించారనే చర్చ కూడా జోరుగా జరగుతోంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకావడమే కాకుండా భట్టి పాదయాత్రను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి యాత్రతో పోల్చడం చర్చనీయాంశంగా మారింది. ‘ భట్టిని చూస్తే వైఎస్‌ను చూస్తున్నట్లే అనిపిస్తోంది. వైఎస్‌ మాదిరిగానే భట్టి కూడ మండే ఎండలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రజల కష్టాలను తెలుసుకుని ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ‘ అని చెప్పుకొచ్చారు.

టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మిగతా సీనియర్ల మధ్య విబేధాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. పార్టీలో టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని, మిగతా సీనియర్లను కలుపుకొని వెళ్లడం లేదని మొదటి నుంచి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అది పార్టీ పదవుల పంపకాల విషయంలో బయటపడటమే కాకుండా.. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇతర సీనియర్లందరు ఒకటిగా జట్టు కట్టారు. హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో భాగంగా దేశ వ్యాప్తంగా పార్టీ నేతలు పాదయాత్రలు చేయాలని ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మొదటి విడతగా 40 నియోజక వర్గాల్లో యాత్రను చేసే విధంగా ప్లాన్‌ చేయడంతో పాటు ఇప్పటి వరకు 21 నియోజక వర్గాల్లో పూర్తి చేశారు. మిగతా నియోజక వర్గాల్లో నూ యాత్రను పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

అయితే ఇదే సమయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా 40 నియోజక వర్గాల్లో 90 రోజుల పాటు దాదాపు 1300 కిలోమీటర్ల మేర పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తన పాదయాత్రలో భాగంగా మూడు సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాల, రంగారెడ్డి జిల్లాలో రెండోది, ముగింపు సభ తన సొంత జిల్లాలో ఖమ్మంను ఎంపిక చేసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన సభను మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు అన్నీ తానై నడిపించారు. ఆయన మొదటి నుంచి భట్టి విక్రమార్కకు అనుకూలంగా ఉంటున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాకు వచ్చే సరికి మేడ్చల్‌ నియోజక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని తెరపైకి తీసుకురావాలనే ఆలోచనతో భట్టి విక్రమార్క ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటున్నప్పటికీ .. ఆయన మొదటి నుంచి భట్టి విక్రమార్కకి సన్నిహితంగా ఉంటున్నారు. టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో విభేదాలు రావడంతో పార్టీకి దూరంగా ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఖమ్మం భట్టికి తన సొంత జిల్లా కావడంతో మూడో సభ విజయవంతం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే ధీమాతో ఆయన ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement