తెలంగాణ కాంగ్రెస్ లో టీపీసీసీ చీఫ్ అంశం చిచ్చు రేపుతోంది. పీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటనపై ఆలస్యం కావడంపై ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు సీరియస్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌పై మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేసినా అదృష్టం బాగుండి కొనసాగుతున్నాడని ఉత్తమ్ కుమార్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పీసీసీ కోసం పరిశీలకుడిని ఎందుకు పంపించడం లేదని అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. మాణిక్కం ఠాగూర్ ఒక్కరే అభిప్రాయ సేకరణ చేస్తారా అని నిలదీశారు.
పీసీసీ పీఠాన్ని బయట నుంచి వచ్చిన వారికి ఇస్తామంటున్నారని, ఇది జరిగితే తమ ఆత్మగౌరవం దెబ్బతినదా ? అని వీహెచ్ ప్రశ్నించారు. మొదటి నుంచి ఉన్న వారి పరిస్థితి ఏంటన్నారు. పీసీసీని పార్టీలో మొదటి నుంచి ఉన్న లాయలిస్టులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై తమ అధినేత్రి సోనియా గాంధీకి తాను లెటర్ రాశానన్నారు. కాంగ్రెస్‌లో తనను సాగనంపే ప్రయత్నం చేస్తున్నారని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి తాను పదవుల కోసం రాలేదని, సోషల్ జస్టిస్ కోసం పని చేస్తున్నానన్నారు. బీజేపీలో జనరల్ సెక్రటరీలు రాష్ట్రానికి వస్తే వారి పార్టీ కోసం కష్టపడుతున్నారని, కానీ తమ పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఫోన్ చేస్తే కూడా లిప్ట్ చేయరని విమర్శించారు. కాగా, వీహెచ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైయ్యాయి.
మరోవైపు టీపీసీసీ చీఫ్ ఎంపికను కాంగ్రెస్ అధిష్టానం దాదాపు పూర్తి చేసిందని తెలుస్తోంది. ఎంపీలు రేవంత్ రెడ్డి, కొమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు పీసీసీ రేసులో ఉన్నారు. అంతే కాదు, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్లు కూడా పరిశీలించారు. ఇక, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం తాను పీసీసీ రేసులో ఉన్నానంటూ ప్రకటించారు. దీంతో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందని అనేది ఉత్కంఠగా మారింది.