న్యూ ఢిల్లీ – కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.. అనర్హత వేటు చట్టంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.. ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని 8 (3) క్లాజ్ ను సవాల్ చేస్తూ కాంగ్రెస్ తరుపు న్యాయవాదులు నేడు పిటిషన్ వేశారు.. పరువునష్టం కేసులో శిక్ష పడినా అనర్షత వేటు వర్తింప చేయకుండా చట్టాన్ని సవరించాలని కోరారు..
ఇది ఇలాఉంటే రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దు ప్రక్రియ అధర్మ పద్దతిలో జరిగిందని పలువురు న్యాయకోవిదులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాలంటే ప్రత్యేక నియమాలను అనుసరించాల్సి ఉంటుందని వాళ్లు గుర్తుచేస్తున్నారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల అనర్హతను నిర్ణయించే అంతిమ అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషనర్ అభిప్రాయాన్ని రాష్ట్రపతి తీసుకోవచ్చని తెలిపారు. అనంతరం సభ్యుడి అనర్హత విషయాన్ని రాష్ట్రపతి.. లోక్‌సభ సెక్రటేరియట్‌కు తెలియజేస్తారని, ఆ తర్వాత నోటిఫికేషన్ జారీ చేయాలని పేర్కొన్నారు. అయితే, రాహుల్ సభ్యత్వ రద్దు విషయంలో ఈ ప్రక్రియ జరుగలేదని న్యాయవాదులు అంటున్నారు. ఇది ముమ్మాటికీ అధర్మ ప్రక్రియేనని తేల్చిచెబుతున్నారు. ఆర్టికల్ 101(3) కింద అనర్హత వేటు వేయాలన్నా రాష్ట్రపతి ఆమోదముద్ర ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు చెబుతున్నదని గుర్తుచేశారు