కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పెట్టబోతున్నారా? కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ఆయన.. సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సొంత కుంపటి పెట్టుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. జమ్మూకశ్మీర్‌లో ఆజాద్ ఇటీవల విస్తృతంగా సమావేశాలు, ర్యాలీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. ఆయన సన్నిహితులు 20 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌కు రాంరాం చెప్పి కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో ఆజాద్ స్పందించారు.
తాను సొంతపార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతానికైతే తనకు అలాంటి ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో నిలిచిపోయిన రాజకీయ కార్యకలాపాలను పునరుద్ధరించడం కోసమే తాను సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు.
నిన్న జమ్మూకశ్మీర్‌లోని రాంబన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆజాద్ మాట్లాడుతూ.. సొంతపార్టీపై మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హయాంలోనూ పార్టీలో విమర్శలకు స్థానం ఉండేదని, విమర్శించడాన్ని వారు తప్పుగా ఎప్పుడూ భావించలేదన్నారు. కానీ ఇప్పుడు వాటికి చోటు ఉండడం లేదని వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ అప్పట్లో ఇద్దరు ప్రధాన కార్యదర్శలును నియమించాలని భావించారని అయితే, దానిని తాను తిరస్కరించడంతో ఆమె కూడా సరేనని అన్నారని ఆజాద్ గుర్తు చేశారు. నేటి నాయకత్వం విమర్శను తప్పుగా చూస్తోందని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు.