పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిరసన తెలపడానికి పీసీసీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ ఎడ్లబండి మీద వచ్చారు. అయితే, ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్దకు వచ్చిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు, ఇతర మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యతో పాటు రాములు నాయక్, ఫిరోజ్ ఖాన్ ఇతర కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లో నిరసనలో పాల్గొన్నారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. పెట్రోల్, డిజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల సమన్వయ కర్త మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు.
మహబూబ్ నగర్లోనూ పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. ఎడ్లబండ్లతో పాటు సైకిళ్లతో కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. అటు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సైకిల్, బండి ర్యాలీలో నిర్వహించారు. ఈ నిరసనలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఎడ్లబండ్ల ఎక్కి అక్కడి కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు.