హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై క్షేత్ర స్థాయిలో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది. విద్యుత్ చార్జీల పెంపు, ప్రజా సమస్యలు, 111 జీవోపైన నిపుణులతో అధ్యయన కమిటిలు పోరాటాలని ఉదృతం చేయాలని నిర్ణయించారు. శుక్రవారం పీఏసీ, టీ పీసీసీ కార్యవర్గ సమావేశం జూమ్‌యాప్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రులు రేణుకాచౌదరి, బలరాంనాయక్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డితో పాటు సీనియర్ ఉపాధ్యక్షులు, ఇతర నాయకులు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలుండటంతో టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకాలేని గాంధీ భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతులకు వెన్నింటి ఉండాలని, దళిత బంధు పథకం అర్హులందరికి లబ్ధి జరిగేలా గ్రామ స్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించారు. 111 జీవో విషయంలో పూర్వ రంగారెడ్డి జిల్లా పరిధిలోని డీసీసీ అధ్యక్షులు, ఇతర సీనియర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి సమీక్షించాలని, ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ఉద్యమాలు చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, సమస్యలను పక్కదారి పట్టే విధంగా వ్యవహారిస్తున్నాయే తప్ప సమస్యలను పరిష్కారించాలనే ఆలోన లేదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువల ధరల పెంపు వల్ల సామాన్య ప్రజలు ఆర్ధికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం అన్ని వర్గాల ప్రజలపై గుదిబండా మారిందనే అంశాలు జూమ్‌యాప్‌లో చర్చకు వచ్చాయి.
గ్యాస్, ఇంధన ధరలను కేంద్రం పెంచడం, విద్యుత్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచడం లాంటి చర్యలతో అధికారంలో ఉన్నవారే ఆందోనలు చేపట్టడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ప్రజా ఉద్యమాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ క్రియాశీలక ఉద్యమాలను చేయాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఉన్న ధరలు, ఇప్పుటి ధరలను ప్రజలకు వివరించి ప్రజా చైతన్యం తీసుకొచ్చి తద్వారా ప్రజలను కాంగ్రెస్ వైపు తిప్పుకునే విధంగా చర్యలుండాలనే అభిప్రాయానికి వచ్చారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక విషయంలో రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన వారికి అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపైన ఉందని, దళితులకు న్యాయం జరిగేలా కార్యాచరణ ఉండాలన్నారు. గతంలో దళిత, గిరిజన వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలు కాకుండా ఉన్నవాటిని గుర్తించాలన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి సాంప్రదాయంగా ఉన్న దళిత ఓటు బ్యాంక్‌ను తిరిగి సాధించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.