Friday, November 22, 2024

Congress Plan – గెలుపు గుర్రాలకే హస్తం టిక్కెట్లు…

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : వచ్చే అసెంబ్లి ఎన్నికలను రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహా ప్రతి వ్యహాలు పన్నుతున్నాయి. మూడోసారి విజయం సాధించి హాట్రిక్‌ సాధించాలనే పట్టుదలతో బీఆర్‌ఎస్‌ పార్టీ ముందుకు సాగుతుండగా.. అంతే స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికలకు ఆరు నెలల సమయమే ఉండటంతో.. అభ్యర్థుల ఎంపికపై ప్రధాన ప్రతిపక్షమైన హస్తం పార్టీ ఇప్పటి నుంచే వడపోత ప్రారంభించింది. సీనియర్లు, జూనియర్లు ప్రధానం కాదని గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని అధిష్టానం భావిస్తోంది. తెలంగాణ ఇచ్చా మని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ.. రెండు పర్యాయాలు ఓటమిని చవి చూసింది. ఆ గుణపాఠాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో తప్పులు జరగకుండా చూసుకోవాలనే అభిప్రాయానికి వచ్చింది. ఇప్పుడు అధికారాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలనే ఆలోచనతో ఆ పార్టీ నాయకులు గట్టి కసరత్తునే చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి .. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాచ్‌ చేసుకునే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. అందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ధీటుగా కాంగ్రెస్‌ నుంచి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు సర్వేల ప్రకారం.. ఈసారి గెలుపు గుర్రాలకే ఎంపిక చేయాలని టీ పీసీసీ నాయకత్వం గట్టి నిర్ణయం తీసుకున్నది. ఢిల్లి నుంచి పైరవీలు చేసుకుంటే లాభం ఉండదని, నిత్యం ప్రజల్లో ఉండి పార్టీ కోసం పని చేసిన వారికే వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందని ఏఐసీసీ అధినాయత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అందులో భాగంగానే.. అసెంబ్లిd ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు హైదరాబాద్‌ను విడిచి పల్లెబాట పట్టారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రతి రోజు జనంలో ఉండే విధంగా స్వచ్చంద కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తయినట్లు గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. వివాదస్పదం లేని నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపికను తేల్చేయాలనే నిర్ణయానికి కాంగ్రెస్‌ వచ్చింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్‌ నాయకులు గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజక వర్గాల్లో.. తిరిగి వారే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీలోకి వెళ్లిన నాయకుల స్థానాల్లోనూ బలమైన నాయకులకు టీ పీసీసీ తయారు చేసింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వస్తే 12 అసెంబ్లి నియోజక వర్గాలకు గాను దాదాపు ఎనిమిది నియోజక వర్గాల్లో అభ్యర్థులు ఎంపిక జరిగిందనే చెబుతున్నారు. మిగతా నాలుగింటిలోనూ పెద్దగా ఇబ్బందేమీ ఉండదని చెబుతున్నారు. నాగార్జున సాగర్‌ నుంచి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, హుజూర్‌నగర్‌ నుంచి ఎంపీ ఉత్తమ్‌కుమారెడ్డి, నల్లగొండ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోదాడ నుంచి పద్మావతి , ఆలేరు నుంచి బీర్ల అయిలయ్య , సూర్యాపేట నుంచి రామిరెడ్డి దామోదర్‌రెడ్డి, భువనగిరి నుంచి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి. నకిరేకల్‌ నుంచి కొండేటి మల్లయ్య, మిర్యాలగూడ నుంచి బి. లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారైనట్లుగానే కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే నాగార్జున సాగర్‌ విషయంలో జానారెడ్డి లేదా ఆయన తనయుడు రఘువీర్‌రెడ్డి బరిలో ఉంటారన్న టాక్‌ వినిపిస్తోంది.

- Advertisement -

ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయానికి వస్తే మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి ఎమ్మెల్యే పొడెం వీరయ్య, వైరా నుంచి రాందాసు నాయక్‌, అశ్వరావు పేట నుంచి తాటి వెంకటేశ్వర్లు పోటీ చేయనున్నారు. సత్తుపల్లి నుంచి మాజీ మంత్రి చంద్రశేఖర్‌, టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతరాయ్‌లు టికెట్‌ రేసులో ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తే మిగతా నియోజక వర్గాల్లో సమీకరణాలు మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట నుంచి మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. వరంగల్‌ పశ్చిమ నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్‌ తూర్పు కొండా సురేఖ, పాలకుర్తి నుంచి జంగా రాఘవరెడ్డి, ములుగు నుంచి ఎమ్మెల్యే సీతక్క, భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణలు బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఉమ్మడి కరీంనగరలోని మంథని నుంచి ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, వెెములవాడ నుంచి ఆది శ్రీనివాస్‌, ధర్మపూరి నుంచి డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, హుస్నాబాద్‌ నుంచి ఇటీవలనే బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, హుజూరాబాద్‌ నుంచి ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌, చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, మానకొండూరు నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు, కోరుట్ల నుంచి జూవ్వాడి నర్సింగరావుతో పాటు కరీంనగర్‌ అసెంబ్లిd నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పోటీ చేసేందుకు రెఢీ అవుతున్నారు.
ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా విషయానికి వస్తే కొడంగల్‌ నుంచి టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, అలంపూర్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, నాగర్‌ కర్నూల్‌ నుంచి మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, కల్వకుర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, అచ్చంపేట నుంచి మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ లేదా చారుకొండ వెంకటేశ్‌, షాద్‌నగర్‌ నుంచి ఈర్లపల్లి శంకర్‌, మక్తల్‌ నుంచి శ్రీహరిలను పోటీకి దింపేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉంది.

ఉమ్మడి అదిలాబాద్‌ విషయానికి వస్తే అదిలాబాద్‌ నుంచి కంది శ్రీనివాస్‌రెడ్డి, మంచిర్యాల నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, బోథ్‌ నుంచి నగేష్‌ జాదవ్‌, బెల్లంపల్లి నుంచి మాజీ మంత్రి గడ్డం వినోద్‌లను బరిలోకి దింపాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. అదిలాబాద్‌ నియోజక వర్గానికి సంబంధించిన కంది శ్రీనివాస్‌రెడ్డి… బీజేపీ నుంచి ఇటీవలనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. స్వచ్చంద కార్యక్రమాలు చేస్తూ నియోజక వర్గంలోని ప్రజల మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయని.. సునీల్‌ కనుగోలు టీమ్‌ రంగంలోకి దిగి ఢిల్లిd పెద్దల వద్ద చర్చించి ఆయన్ను కాంగ్రెస్‌లోకి తీసుకున్నారు.
నిజామాబాద్‌ జక్కల్‌ నుంచి గంగారామ్‌, నిజామాద్‌ అర్బన్‌ నుంచి టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌, నిజామాబాద్‌ రూరల్‌ నుంచి మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, కామారెడ్డి నుంచి మాజీ మంత్రి షబ్బీర్‌లీ, బోధన్‌ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిలు ఉన్నారు.
ఇక మెదక్‌ విషయానికి వస్తే మెదక్‌ నుంచి తిరుపతిరెడ్డి, సంగారెడ్డి జగ్గారెడ్డి, ఆందోల్‌ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, జహీరాబాద్‌ నుంచి మాజీ మంత్రి గీతారెడ్డిలు పోటీ చేయనున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డిలోని మల్కాజ్‌గిరి నుంచి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌, వికారాబాద్‌ నుంచి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌, ఇబ్రాహీపట్నం నుంచి మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి , పరిగి నుంచి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో పాటు హైదరాబాద్‌కు సంబంధించి నాంపల్లి నుంచి ఫిరోజ్‌ఖాన్‌, జూబ్లి హిల్స్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి, సికింద్రాబాద్‌ నుంచి ఆదం సంతోష్‌కుమార్‌, గోషామహాల్‌ నుంచి మెట్టు సాయికుమార్‌లు పోటీ చేయనున్నారు. ఖైరతాబాద్‌ నుంచి మాజీ మంత్రి పీజేఆర్‌ కూతురు కార్పోరేటర్‌ విజయారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిత్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. అంబర్‌పేటలో ఆర్‌. లక్ష్మణ్‌ యాదవ్‌, ముషిరాబాద్‌ నుంచి యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షులు అనిల్‌కుమార్‌ యాదవ్‌లు పోటీ చేసేందుకు రెఢీ అవుతున్నారు.

పోటీ ఉన్న చోట సర్దుబాటు..
రాష్ట్రంలోని కొన్ని నియోజక వర్గాల్లో టికెట్‌ రేసులో చాలా మంది ఉన్నారు. ఒక్కో నియోజక వర్గంలో ఇద్దరు నుంచి ఐదారుగురు వరకు పోటీ పడుతున్నారు. ఇలాంటి నియోజక వర్గాల్లో సర్వేలో ముందున్నవారిని గుర్తించాలని, మిగతా నాయకులకు బుజ్జగించాలనే ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ లేదా నామినెటెడ్‌ పదవులు ఇచ్చేలా ఒప్పించాలని ఆలోచనతో ఉన్నారు. పార్టీ కోసం పని చేసి అభ్యర్థిని గెలిపిస్తేనే పదవీ ఇస్తామని షరతు కూడా పెట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement