Thursday, November 21, 2024

Breaking: మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ కు షోకాజ్ నోటీస్.. వాట్ నెక్ట్స్?

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుకు పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీసు జారీచేసింది. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పర్యటన సందర్భంగా ఆందోళన విషయంలో టీ.కాంగ్రెస్ కమిటీ షాకాజ్ నోటీసు జారీ చేసింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఆయన.. అసమ్మతి నేతగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. టీపీసీసీ కొత్త నాయకత్వం వచ్చాక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా సీనియర్ నేత వీహెచ్ హన్మంతరావు పర్యటన సందర్భంగా ఏర్పడిన వివాదంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు.

ప్రేమ్ సారగ్ రావు కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ కార్యదర్శి లాంటి కీలక పోస్టులో ఉన్నారు. ఆయన భార్య కొక్కిరాల సురేఖ మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు. పార్టీలో ఆయన కీలకంగా ఉండగా.. తాజాగా ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో అటు పార్టీకి, ఇటు కార్య‌క‌ర్త‌ల‌కు ఇబ్బందిగా మారుతోంది. అటు రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఇటు ఉమ్మడి జిల్లాలో కీలక నాయకులతో ఆయనకు విభేదాలున్నాయి.

రేవంత్ రెడ్డి పీసీసీ ప‌ద‌వి చేప‌ట్టిన త‌ర్వాత త‌న‌కు వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని ప్రేమ్ సాగ‌ర్ రావు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో తాను కాంగ్రెస్ పార్టీ వీడుతాన‌ని, కొత్త పార్టీ పెడ‌తాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయన తీసుకునే నిర్ణ‌యాలు న‌చ్చ‌ని ఆరుగురు కాంగ్రెస్ కౌన్సిల‌ర్లు టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. కొద్ది రోజుల కింద‌ట క‌ళ్లాల వ‌ద్ద‌కు కాంగ్రెస్ పేరుతో పార్టీ ఆందోళ‌న‌కు పిలుపునిచ్చింది. ఈ కార్య‌క్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత వి.హ‌న్మంత‌రావు, ఇతర నేత‌లు హాజ‌ర‌య్యారు. వారు ఆందోళ‌న నిర్వ‌హించి క‌లెక్ట‌రేట్ వ‌ద్ద‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేశారు. అయితే ప్రేమ్ సాగర్ రావు అనుచ‌రులు వీహెచ్‌తో స‌హా ప‌లువురు నేత‌ల‌ను అడ్డుకున్నారు. దీంతో ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్టీ పంపితేనే తాను వ‌చ్చాన‌ని త‌న‌ను అడ్డుకోవ‌డం ఏమిట‌ని ప్రేమ్ సాగర్ రావు వ‌ర్గంపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాన‌ని హెచ్చరించారు. అన్నట్లుగా ఆయన సోనియాగాంధీ త‌దిత‌ర నేత‌ల‌కు లేఖ రాశారు. ఈ నెల 26వ తేదీ వ‌ర‌కు ప్రేమ్ సాగర్ రావుపై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే గాంధీ భ‌వ‌న్ ఎదుట నిర‌స‌న దీక్ష చేస్తానంటూ హెచ్చ‌రించారు. దీంతో అధిష్టానం న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. మరోవైపు అధిష్టానం చర్యలను బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ప్రేమ్ సాగర్ రావు అనుచరులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement