హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? అన్న ఉత్కంఠకు తెర పడింది. ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ పేరును పార్టీ ఖరారు చేసింది. తొలి నుంచి మాజీ మంత్రి కొండా సురేఖను ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, అనూహ్యంగా నిర్ణయం మార్చుకుంది. అభ్యర్థి ఎంపికపై శుక్రవారం జరిగిన చర్చలో పలువురి పేర్లు పరిశీలనకు వచ్చినా.. అధికార టీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ విద్యార్థి నాయకుడిని అభ్యర్థిగా నిలబెడుతున్న నేపథ్యంలో బల్మూరు వెంకట్ పేరును కాంగ్రెస్ ముఖ్యులు ప్రతిపాదించారు. పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఆయన పేరును ఖరారు చేశారు. శనివారం టీపీసీసీ చేపట్టనున్న విద్యార్థి, నిరుద్యోగ సైరన్ సందర్భంగా వెంకట్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడిగా వెంకట్ రెండు పర్యాయాలుగా పనిచేస్తున్నారు. వెంకట్ పేరును ప్రతిపాదించే ముందు పార్టీ ముఖ్యులు ఆయనను పిలిచి అభిప్రాయం తీసుకున్నారు.
టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ బరిలో ఉండా.. బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గుర్తుపై పోటీ చేసిన ఈటల.. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరారు. దీంతో ఉప ఎన్నికల్లో బీజేపీ గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఇక, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 వేల ఓట్లు సాధించి.. రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఇప్పుడు ఆ ఓట్లను కాపాడుకుంటుందా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నిక కావడంతో కాంగ్రెస్ పార్టీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఇది కూడా చదవండిః IPL 2021: పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం.. కోల్‌కతాపై గ్రాండ్ విక్టరీ