Friday, November 22, 2024

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వం: కోమటిరెడ్డి వార్నింగ్

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దళిత బంధు’ పథకాన్ని  మునుగోడు నియోజకవర్గ దళితులకు కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమ‌టిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి త‌మ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళ‌న‌కు దిగారు. అదే స‌మ‌యంలో రేష‌న్ కార్డుల పంపిణీకోసం మునుగోడు చౌర‌స్తా మీదుగా వెళ్తున్న‌ మంత్రి జగదీశ్‌ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు  పలువురు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. పోలీసుల తీరుపై రాజగోపాల్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేత‌లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ నిర్బంధాలు చేస్తుండ‌డం సరికాదని ఆయ‌న అన్నారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్‌ను ఖండించారు. అరెస్ట్ చేసిన కార్య‌క‌ర్త‌ల‌ను వెంటనే విడుదల చేయాల‌ని రాజ‌గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారం శాశ్వతం కాదని, త్వరలో తామేంటో చూపిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వ‌బోమ‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ‌ వ్యాప్తంగా దళితులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. మునుగోడుకు జగదీశ్‌ రెడ్డి నిధులు తీసుకురావడం లేదని చెప్పారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేంద‌ర్‌ను ఓడించేందుకు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. దళితులను మరోసారి మోసం చేసేందుకు యత్నిస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.

కాగా, మొన్న మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డికి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో జగదీశ్‌ రెడ్డి ప్రసంగాన్ని ఎమ్మెల్యే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement