Sunday, November 17, 2024

ఈటల బాటలో కోమటిరెడ్డి… బీజేపీలో చేరేది ఎప్పుడో ?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ అనంతరం తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈటల బాటలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాషాయ కండువ కప్పుకోనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో తాను లేక‌పోవ‌డంతో ఇక బీజేపీ గూటికి చేర‌డ‌మే మేలనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి గత దాదాపు ఏడాది కాలంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతునే ఉంది. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి బీజేపీకే ఉందని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. అయితే, రాజగోపాల్ రెడ్డి మాత్రం సరైన టైమ్ కోసం ఎదురు చూస్తున్నట్ల తెలుస్తోంది.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డితో భేటీ కావడం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. ఆదివారం ఇరువురి మధ్య దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా డీకే అరుణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు. అయితే, కొంత సమయం కావాలన్న రాజగోపాల్ రెడ్డి.. త్వరలో తన నిర్ణయాన్ని చెప్తానని డీకే అరుణకు తెలిపారు.

మరోవైపు ఈ నెల 13న బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమ‌ని రాజగోపాల్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని త‌న‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయ‌న ఆరోపిస్తున్నారు. తాను ఏ బీజేపీ నేతనూ కలవలేదని.. కానీ అలాంటి లీకులు ఎందుకు ఇస్తున్నారో తెలియదడం లేద‌ని చెప్పుకొచ్చారు. రాజకీయంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని గతంలోనే చెప్పాన‌ని.. ఇప్పుడు రాజకీయాలు చేసే సమయం కాదని అభిప్రాయ‌ప‌డ్డారు. కరోనాతో జనం ఇబ్బంది పడుతుంటే… రాజకీయాలేంటి అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

కాగా, ఇటీవల తనను కలిసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని డీకే అరుణ బీజేపీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. డీకే ఆరుణ కాంగ్రెసు నుంచే బీజేపీలోకి వచ్చారు. తన పరిచయాలను వాడుకుంటూ కాంగ్రెసు నేతలను బీజేపీలోకి తేవడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వలస ద్వారా తమ బలాన్ని పెంచుకునే యోచనలో బీజేపీ ఉంది. అందులో భాగంగా ఇతర పార్టీలకు చెందిన నాయకులను వల వేస్తోంది. తర్వలో మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరబోతున్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బీజేపీ ఫోకస్ పెట్టిందనే టాక్ వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి: ఈటలకు అపాయింట్‌ మెంట్ ఇవ్వని స్పీకర్

Advertisement

తాజా వార్తలు

Advertisement