హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ అభివృద్ది పేరుతో వందల కోట్లు ఆ నియోజకవర్గంపై ఖర్చు చేస్తున్నారు. దీంతో తమ నియోజకవర్గానికి కూడా నిధులు కేటాయిస్తే.. రాజీనామాకు సిద్ధమంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నారు. ప్రజలు కూడా పలు నియోజవకర్గాల్లో ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మునుగోడు అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తే ఎమ్మెల్యే పదవికి పోటీచేయనని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.
టీఆర్‌ఎస్ సర్పంచ్ ఉన్న దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేని శంకుస్థాపన చేయనీయడం లేదని ఆయన ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న దగ్గర మంత్రిని మునుగోడు నియోజకవవర్గంలో తిరగనీయమని హెచ్చరించారు. ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ వేల కోట్లు కుమ్మరించడం సీఎం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీ నేతలను గెలవనీయకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
కాగా, ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఇలాంటి సవాలే చేశారు. తన నియోజవర్గానికి దళిత బంధు పథకంతోపాటు అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండిః దళిత బంధు సభ.. టీచర్లకు జనసమీకరణ బాధ్యత!