హైదరాబాద్, ఆంధ్రప్రభ: జనాభాలో సగ భాగంగా ఉన్న మహిళా ఓట్లపైన అన్ని రాజకీయ పార్టీలు గురిపెట్టాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలో రావాలంటే మహిళా ఓట్లు కీలకమని, అందుకు రాజకీయ పార్టీలన్ని మహిళా సాధికారతను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి.. వివిధ రకాలు డిక్లరేషన్లను
ప్రకటిస్తూ ముందుకు సాగుతోంది. ఒక వైపు మహిళా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే.. మరో వైపు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నామినెటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని కాంగ్రెస్ నేతలు అంచనాకు వచ్చారు. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్‌తో పాటు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీత, నేత కార్మికులకు నెలకు రూ.4 వేల పెన్షన్ ప్రకటించిన పీసీసీ.. ఇప్పుడు ఈ నెల 20న నాగర్‌కర్నూల్ జిల్లా వేదికగా మహిళా డిక్లరేషన్‌ను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కుచుకుళ్ల దామోదర్‌రెడ్డితో పాటు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నుంచి ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవుతున్నారు. ఈ సభలోనే ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మహిళా డిక్లరేషన్ ప్రకటించాలని నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మే నెలలో సరూర్‌నగర్ సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాహుల్‌గాంధీ కూడా గత ఏడాది మే నెలలోనే రైతు డిక్లరేషన్ ప్రకటించి.. రెండు వారాల క్రితం ఖమ్మంలో నిర్వహించిన జనగర్జనలో రాహుల్‌గాంధీ పెన్షన్ పథకం కింద రూ.4 వేలు ఇస్తామని ప్రకటించారు. ఐదు రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భూమి డిక్లరేషన్‌ను కూడా ప్రకటించారు. ఇప్పుడు మహిళా డిక్లరేషన్‌తో మహిళా ఓట్లు మెజార్టీ సాధించుకుంటామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. డిక్లరేషనన్లు, సంక్షేమ పథకాల హామీల వల్ల అన్ని వర్గాల ఓట్లను దండుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
కాగా, మహిళా డిక్లరేషన్‌లో చేర్చే అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కసరత్తు ప్రారంభించి ఒక నిర్ణయానికి వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రకటించిన విధంగా తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని ఇవ్వాలని నిర్ణయించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు గృహలక్ష్మి పథకం కింద రూ.2 వేల ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించారు. కాలేజీ కోర్సులు చదివే విద్యార్థినులకు ద్విచక్ర వాహనాల అందజేయాలనే హామీని ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. రూ.500లకు వంట గ్యాస్ బండ, స్వయంసహాయక మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల హామీని చేర్చనున్నారు. దీంతో పాటు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ షాపుల ద్వారా 9 సరుకులు ఇచ్చిన విధంగానే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని పునరుద్దస్తామనే హామీ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్తారు. బియ్యంతో పాటు ఉప్పు, పప్పు, చింతపండు, పసుపు, మిర్చి, గోధుమలు, సబ్బులు తదితర వస్తవులును ప్రభుత్వం అందించేది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం వీటన్నింటిని రద్దు చేసి.. కేవలం బియ్యం మాత్రమే పంపిణి చేసి మిగతా తొమ్మిది రకాల వస్తువులను రద్దు చేయడం ద్వారా సామన్య ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటన్నింటిని రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ కింద అందిస్తామని హామీ ఇస్తే మహిళల నుంచి సానుకూలత వస్తుందనే అభిప్రాయంతో ఉన్నారు.
సెప్టెంబర్ 17న ఎన్నికల మేనిఫెస్టో?
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మూడు (రైతు, యూత్, భూమి) డిక్లరేషన్లు ప్రకటించడంతో పాటు రూ.4 వేల పెన్షన్ పథకాన్ని ప్రకటించింది. ఇప్పుడు మహిళా డిక్లరేషన్ కోసం ప్రకటించాక.. భవిష్యత్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డిక్లరేషన్లను కూడా ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మొత్తం డిక్లరేషన్లలోని అంశాలతో మరికొన్నింటిని జోడించి సెప్టెంబర్ 17న ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలనే యోచనలో కాంగ్రెస్ నేతలున్నారు.