చత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ ఓ అసమర్థ ఆపరేషన్ అని రాహుల్ గాంధీ విమర్శించారు. మావోలతో జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 22 మంది జవాన్లు వీర మరణం పొందారు. చాలా అసమర్థ రీతిలో భదత్రా దళాలు ఆ ఆపరేషన్ చేపట్టాయని రాహుల్ విమర్శించారు. ట్విట్టర్‌లో ఆయన స్పందిస్తూ.. చాలా బలహీనమైరీతిలో బలగాలు ప్రణాళికలు వేశాయని విమర్శించారు. మన జవాన్లను వ్యర్థంగా చూడరాదు అని, ఎటువంటి సదుపాయాలు కల్పించకుండానే బలగాలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం దళాలను పట్టించుకోవడం లేదన్న రీతిలో రాహుల్ తన ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు.
ఇంటెలిజెన్స్ తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల ఈ ఘటన జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కానీ సీఆర్‌పీఎఫ్ డైరక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ మాత్రం ఈ ఆపరేషన్‌లో ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంలో ఎటువంటి లోపం లేదన్నారు. అయితే రాహుల్ తన ట్విట్టర్‌లో సీఆర్‌పీఎఫ్ డైరక్టర్ వ్యాఖ్యలను జత చేస్తూ.. ప్రభుత్వ బలగాలు చేపట్టిన ఆపరేషన్‌ను తప్పుపట్టారు. ఒకవేళ ఇంటెలిజెన్స్ వైఫల్యం లేకుంటే, అప్పుడు మరణాల రేటు 1-1గా ఉందంటే ఆ ఆపరేషన్ లో లోపం ఉందని, అసమర్థ రీతిలో దాన్ని అమలు చేశారని రాహుల్ విమర్శించారు.