Saturday, November 23, 2024

టీఆర్ఎస్ లోకి కౌశిక్ రెడ్డి ?.. ఉత్తమ్ కు తెలియదా?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం హుజూరాబాద్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడు, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కౌశిక్ రెడ్డి టీఆరెస్ లో చేరుతుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈటల రాజీనామా ఆమోదం పొందితే హుజురాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దెబ్బ కొట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలో ఆయా పార్టీల కీలక నేతలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత కౌశిక్ రెడ్డి..గులాబీ పార్టీ అధినేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ లను శుక్రవారం కౌశిక్ రెడ్డి భేటీ కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. ప్రగతి భవన్ సమీపంలో ఓ స్టార్ హోటల్ లో వీరు సమావేశమయ్యారు. పార్టీలో చేరిక, ఎమ్మెల్యే అభ్యర్థి విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈట‌ల పార్టీ మారుతున్నార‌ని తెలిసిన నాటి నుండే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారన్న ప్ర‌చారం జరుగుతోంది. అయితే, ఈట‌ల బీజేపీలో చేరబోతుండడంతో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఈటలపై కాంగ్రెస్ తరుపున కౌశిక్ రెడ్డి పోటీ చేశారు. ఈట‌ల బీజేపీ నుండి పోటీ చేస్తే… కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ నుండి పోటీలో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ టికెట్ దక్కకపోతే ఏదైనా కీలక పదవి ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే, పీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌మ్ముడైన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడతారనే ప్రచారం హస్తం పార్టీకి కలవరానికి గురి చేస్తోంది. ఉత్త‌మ్ కు తెలియ‌కుండా అడుగు కూడా వేయ‌ను అని త‌నే స్వ‌యంగా చెప్పుకున్న కౌశిక్ రెడ్డి.. కేటీఆర్ తో భేటీ వెనుక ఉత్త‌మ్ స‌హ‌యం ఉండి ఉంటుంద‌ని ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement