Tuesday, November 26, 2024

టీకాలపై జగన్ ప్రధానిని ఎందుకు ప్రశ్నించరు?

వ్యాక్సిన్ల అంశంపై రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం జగన్‌ లేఖ రాయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్‌ రమేశ్‌ ఘాటుగా స్పందించారు. జగన్ టీకాల సరఫరాపై ప్రధానిని ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. టీకా సమస్యను కేంద్రం, రాష్ట్రాల మధ్య సమస్యగా ఎవరు మార్చారు? అని ప్రశ్నించారు. 18-44 ఏళ్ల వారికి టీకాలు విరమించుకుంటామనే నిర్ణయం ఎవరిది ? అని నిలదీశారు. విధానం రూపొందించే ముందు రాష్ట్రాలను ఎందుకు అడగలేదని, మోదీని ఈ ప్రశ్నలు ఎందుకు అడగకూడదని జైరామ్ రమేశ్ అడిగారు. ఈ మేరకు ఆయన ట్వీట్​లో పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితం టీకాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలందరూ ఒకే మాట మీద ఉండాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదని ముఖ్యమంత్రి జగన్‌, సీఎంలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. గ్లోబల్ టెండర్లు ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని లేఖలో తెలిపారు. వ్యాక్సిన్ లభ్యత విషయంలో కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు అన్నట్టు పరిస్థితి మారుతోందని చెప్పారు. కేంద్రమే వ్యాక్సిన్లను కొనుగోలు చేసి.. రాష్ట్రాలకు త్వరగా సరఫరా చేపట్టాలని సీఎం జగన్‌ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement