రోజు రోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులేకుండా పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు, నగరాల్లో లీటరు పెట్రోల్ ధర వంద దాటింది. ఒకవైపు కరోనా తరుముతుంటే.. మరో వైపు ఇంధన ధరలు చుక్కలనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. మహమ్మారి వేళ కూడా బీజేపీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
ఢిల్లీలో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో .. పెట్రోల్, డీజిల్‌పై పన్ను కేవలం 9.20 మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడు అది రూ.32కు చేరినట్లు ఆయన తెలిపారు. పెట్రోల్, డీజిల్ పై పెరిగిన ఎక్సైజ్ సుంకాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేసీ వేణుగోపాల్ కోరారు. మరోవైపు ఏపీ, తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో ఇంధన ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు.