తెలంగాణలో పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చ మళ్లీ మొదలైంది. సీనియర్ నాయకులు ఎక్కువగా ఉండడం, అధిక మంది పదవిని ఆశించడంతో కాంగ్రెసు అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోలేకపోతోంది. గత కొన్ని రోజులు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఢిల్లీలో చర్చ జరుగగా…దీనిపై పార్టీ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో టీపీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి, కొమటిరెట్టి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ లాంటి చాలా మంది పీసీసీ పదవిని ఆశిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ఎంపిక చేశారనే వార్తలు ప్రముఖంగా వినిపించాయి. అయితే, పార్టీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేసింది అనేది సస్పెన్స్ గా మారింది.
తెలంగాణలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికతోపాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో సంస్థాగత అంశాపై ఏఐసీసీ ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గుజరాత్, గోవా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలపై కాంగ్రెస్ పెద్దలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఖాళీగా ఉన్న పీసీసీ అధ్యక్ష పదవి భర్తీకి అధిష్టానం కసరత్తు ముమ్మరం చేస్తోంది. తెలంగాణ పీసీసీ సారథ్యంపై గతంలోనే ఏఐసీసీ అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. సీనియర్లు, కోర్ కమిటీ మెంబర్లు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను మాణిక్కం ఠాగూర్ స్వీకరించారు. దీనిపై అధిష్టానికి నివేదిక కూడా సమర్పించారు. అయితే, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పూర్తి అయ్యే వరకు దీనిపై ప్రకటన చేయవద్దని మాజీ మంత్రి జానారెడ్డి కోరడంతో అప్పుడు వాయిదా పడింది. ప్రస్తుతం ఎటువంటి ఆటంకాలు లేకపోవడంతో పీసీసీ అధ్యక్షుడిని నియమించేందుకు అధిష్టానం సిద్దమయినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడి రేసులో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, వీరిలో ఎవరికి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు రేవంత్ రెడ్డికే పీసీసీ అధ్యక్ష పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతున్న వేళ పార్టీలో నేతల మధ్య విబేధాలు బయటపడుతున్నాయి. రేవంత్‌ను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న జగ్గారెడ్డి.. తాను పీసీసీ రేసులో ఉన్నట్లు ఇటీవల ప్రకటించారు. అంతేకాదు తమకు నచ్చిన వ్యక్తిని నియమిస్తే కలిసి పనిచేస్తామని.. లేదంటే ఎవరి వారు పని చేసుకుంటామని వ్యాఖ్యానించారు. ఇక, రేవంత్ నియామకాన్ని తొలి నుంచి పార్టీ సీనియర్ నేత వీహెచ్ వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ అడుగుపెట్టిన ప్రతి చోట పార్టీ ఓటమి పాలైందని, ఏం మొహం పెట్టుకొని ఆయన పీసీసీ పదవి ఆశిస్తున్నారని వీహెచ్ విమర్శిస్తున్నారు. అంతేకాదు కొద్ది రోజుల క్రితం రేవంత్ పై పార్టీ హైకమాండ్ కి కూడా ఓ వర్గం నేతలు ఫిర్యాదు చేశారు. ఆయనకు పీసీసీ ఇవ్వడదని స్పష్టం చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యలో కొత్త బాస్ గా పార్టీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేసింది అనేది సస్పెన్స్ గా మారింది.
ఇది కూడా చదవండి: ఏపీకి థర్డ్ వేవ్ టెన్షన్… పిల్లల కోసం మూడు కేర్ సెంటర్లు