హైదరాబాద్, ఆంధ్రప్రభ: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పకడ్బంది వ్యూహంతో ముందుకు వెళ్లుతోంది. ఒక వైపు వివిధ పార్టీల్లోని అసంతృప్తులను కాంగ్రెస్‌లో చేర్చుకుని పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న పీసీసీ నాయకత్వం.. మరో వైపు పార్టీ కేడర్‌ను నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ప్రణాళిక రూపొందిస్తోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లిd నియోజక వర్గాల్లో దాదాపు 60 వేల మంది కార్యకర్తలను నాయకులుగా తయారు చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. అధికార బీఆర్‌ఎస్ పార్టీని ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కోనేందుకు క్షేత్రస్థాయిలో బలమైన కేడర్‌ను ఏర్పాటు చేస్తోంది.
ప్రతి పోలింగ్ బూత్‌లో 60 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జీగా నియమించి.. అతనికి మద్ధతుగా మరో 10 మందిని జోడిస్తారు. ఈ టీమ్ ఎన్నికల సమయంలో ఓటింగ్ పూర్తయ్యే వరకు అతనితోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నారు. దీంతో పాటు ప్రతి పోలింగ్‌బూత్‌కు మరొకరికి బూత్‌లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)గా బాధ్యతలు అప్పగిస్తారు. దీంతో పాటు 10 పోలింగ్ బూత్‌లకు కలిపి ఒక క్లస్టర్‌గా మరో కీలక వ్యక్తిని నియమించాలనే ఆలోచన చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని ఒక్కో అసెంబ్లిd నియోజక వర్గంలో దాదాపుగా 200 నుంచి 220 వరకు పోలింగ్ బూత్‌లు ఉంటాయి. ఒక అసెంబ్లిd నియోజక వర్గంలో దాదాపుగా 5 వేల మందికి పైగా బీఎల్‌ఏలను కాంగ్రెస్ పార్టీ నియమించనుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లిd నియోజక వర్గాల్లో 60 వేల మంది వరకు బీఎల్‌ఏలను నియమించనున్నారు.
ఈ అరవై వేల మంది బీఎల్‌ఏలు నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు పార్టీ కార్యక్రమాలను కూడా విస్తృతం చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూనే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయనున్నారు. ఇటీవల తుక్కుగూడలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ కార్డులను ప్రతి ఇంటికి చేర్చనున్నారు. అంతకు ముందు ప్రకటించిన రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీతో పాటు త్వరలో ప్రకటించబోయే ఓబీసీ, మహిళా, మైనార్టీ డిక్లరేషన్లను కూడా బూత్‌లెవల్ ఏజెంట్ల ద్వారా ప్రతి గడపకు వెళ్లేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలు, అధికారంలోకి వచ్చాక అమలు చేసే పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించేందుకు ఏర్పాటు చేసిన బీఎల్‌ఏ వ్యవస్థ ఏర్పాటు ద్వారా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 60 వేలకు పైగా కాంగ్రెస్ సైన్యం ఏర్పాటవుతోందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఓటర్‌ను పోలింగ్‌బూత్‌కు తీసుకెళ్లే వరకు..
బీఎల్‌ఏ వ్యవస్థ ద్వారా దొంగ ఓట్లను కూడా అరికట్టేందుకు వీలుంటుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. స్థానిక యువతకు ఈ బాధ్యతలు అప్పగించడం వల్ల.. ఓటింగ్ సమయంలో అక్రమాలు జరగకుండా అరికట్టేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రతి ఓటరను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి ఓటు హక్కును వినియోగించే విధంగా చూడనున్నారు. వృద్ధులు, వికలాంగులు, ఎన్నికల సమయంలో బయట ఉన్నవారిని రప్పించి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా, అవి కాంగ్రెస్ వైపు మళ్లే విధంగా పని చేస్తారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
వార్‌రూమ్ నుంచి మార్గనిర్దేశం..
పోలింగ్ బూత్ ఏజెంట్లకు గాంధీభవన్ వేదికగా ఏర్పాటు చేసిన వార్‌రూమ్ నుంచి ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేయనున్నారు. పార్టీ కార్యక్రమాలను వివరిస్తూనే బీఎల్‌ఏలకు అప్పగించిన కార్యక్రమాలు, వారు చేపట్టిన పనులను వార్‌రూమ్‌లో పొందుపర్చే విధంగా ఏర్పాటు చేశారు. దీంతో ఎవరు ఎక్కడ పని చేస్తున్నారో తెలుసుకునేందుకు సులువుగా ఉంటుందని, అలసత్వం వహించే వారిని వెంటనే అప్రమత్తం చేయడానికి వీలుంటుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.