Tuesday, November 26, 2024

Congress Double Dhamaka – ఇటు చేరిక‌లు – అటు ఘ‌ర్ వాప‌సీ…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: మరో నాలుగు మాసాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ భారాసను వెనక్కి నెట్టి రాష్ట్రంలో పాగా వేసేం దుకు ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని ప్రతి పక్ష కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు విశ్వ సనీయ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ తో పాటు- కాంగ్రెస్‌ సీనియర్లు, జిల్లా స్థాయి నేతలు ఈ వ్యూహాన్నే అమలు చేస్తున్నట్టు- చెబుతున్నారు. భారాస హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, భూ దోపిడీలు, ‘ధరణి’తో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తీసుకురావడం ఒక వ్యూహమైతే భారాస, భాజపాల్లో అసంతృప్త నేతలకు గాలం వేసి వారిని పార్టీలోకి తీసుకోవడం, వివిధ కారణాల వల్ల కాంగ్రెస్‌ను వీడిన వారితో మంతనాలు జరిపి తిరిగి వారిని పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం రెండో వ్యూహంగా పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ద్విముఖ వ్యూహం అమలు చేస్తుండడంతో ఊహిం చని ఫలితాలు వస్తున్నాయని, మరింత ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లి రాష్ట్రంలో అధికార భారాస ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి
కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామన్న ధీమాతో పనిచేస్తున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ నిర్ణయానికి వచ్చినట్టు- తెలుస్తోంది.

కాగా తెలంగాణ కాంగ్రెస్‌లో ద్విగుణీకృతమవుతున్న కొత్త ఉత్సాహం పార్టీలో పలువురి చేరికకు కారణమవుతోంది. నిర్మల్‌, సిరిసిల్ల వంటి జిల్లాలలో పలువురు కీలక నాయకులు ఆయా పార్టీలను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండగా మిగతా జిల్లాలకు చెందిన నాయకులు సైతం పార్టీలోకి వస్తామంటూ సంకేతాలు పంపిస్తున్నారని సమాచారం. నిర్మల్‌ జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమ నేత, భారాస చీఫ్‌ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు శ్రీహరిరావు ఇప్పటికే పీసీసీ చీఫ్‌ రేవంత్‌ సమక్షంలో కండువా కప్పుకోగా ముధోల్‌ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌ త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి నేడు కాంగ్రెస్‌ గూటికి రానున్నారు. శుక్రవారం పార్టీ చీఫ్‌ రేవంత్‌ ఇతర ముఖ్య నేతలు గుర్నాథరెడ్డి ఇంటికెళ్లి సమాలోచనలు జరిపారు. కాంగ్రెస్‌లో చేరడానికి సుముఖత వ్యక్తం చేసిన ఆయన నేడు కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటానని చెప్పారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లాకు శాసన మండలి మాజీ చైర్మన్‌, భారాస నేత భూపాల్‌రెడ్డికి కూడా కాంగ్రెస్‌ పార్టీ గాలం వేసే పనిలో ఉన్నట్టు- తెలుస్తోంది. భాజపా నేత, మహబూబ్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యేను కూడా పార్టీలోకి లాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు- తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా ఉన్నవారు సైతం బీఆర్‌ఎస్‌ పార్టీని వీడాలన్న యోచనలో ఉన్నట్టు- సమాచారం. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ నేతలు వారితో మంతనాలు జరుపుతుండడం చర్చనీయాంశమైంది. ఒకవైపు చేరికలు కొనసాగిస్తూనే మరోవైపు కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ భాజపా, భారాసలపై ఒంటి కాలుపై లేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకోవైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ యాత్రలో సమయం దొరికినప్పుడల్లా అధికార పార్టీ వైఫల్యాలను కడిగి పారేస్తున్నారు.

అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్‌ పదేపదే ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ధరణి పోర్టల్‌ కారణంగా అధికార పార్టీ నాయకులు మాత్రమే ప్రయోజనం పొందారని దుయ్యబడుతున్నారు. నిజంగా భూములను కలిగి ఉన్న చాలా మంది ధరణితో ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆధారాలతో సహా బయట పెడుతున్నారు. సభలు, సమావేశాలే కాకుండా కాంగ్రెస్‌ పార్టీ సామాజిక మాధ్యమాల్లో సైతం హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం సంధించారు. ఈ ధోరణిని కొనసాగిస్తూనే పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలలో ఇతర పార్టీ నాయకులకు గాలం వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ధరణి పోర్టల్‌, రీజినల్‌ రింగ్‌ రోడ్‌ అలైన్మెంట్‌లో అవకతవకలు, ఔటర్‌ రింగ్‌రోడ్డు టోల్‌ ఫీజు వసూలు లీజు తదితర అంశాలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రతిరోజు ప్రస్తావిస్తూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు.

- Advertisement -

21 లేదా 23న ప్రియాంకగాంధీ సభ?
ఒకవైపు ప్రభుత్వం మీద ఆరోపణలు.. ఇంకొక వైపు చేరికలే కాకుండా తెలంగాణ ప్రజలకు ఒక నిర్దిష్టమైన సంకేతాలను ఇవ్వడానికి పార్టీ అగ్రనేతలను తెలంగాణకు రప్పించే ప్రయత్నాలను సైతం తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ముమ్మరం చేస్తున్నారు. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సాగిస్తున్న పాదయాత్ర నేపథ్యంలో దాని ముగింపు సభకు ప్రియాంక గాంధీ లేదా రాహుల్‌ గాంధీని ఆహ్వానించే సన్నాహాల్లో ఉన్నారు. అన్నీ కుదిరితే జూన్‌ 21 లేదా 23వ తేదీలలో అగ్రనేతల్లో ఒకరు ఖమ్మం వేదికగా జరిగే సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక తమ విజయ ప్రస్థానాన్ని ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించాలని అనుకుంటు-న్న తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు అక్కడ బలమైన నేతగా పేరన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు దాదాపు డిసైడ్‌ అయ్యారు. ఆయన కూడా కాంగ్రెస్‌ పార్టీవైపే మొగ్గు చూపుతున్నారన్న సంకేతాలు కూడా వచ్చాయి. మొత్తం మీద తెలంగాణలో నెంబర్‌ టు- తామేనని, నంబర్‌వన్‌ స్థానాన్ని -కై-వసం చేసుకుంటామని కాంగ్రెస్‌ నాయకులు పూర్తి ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్‌ నేతల్లో కనిపిస్తున్న ఈ ధీమాను కరిగించే దిశగా బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తాయో అన్నది వేచి చూడాలి.

కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్‌లో ఫుల్‌ జోష్‌
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహం ఏమో కానీ తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో దూకుడు రోజురోజుకూ పెరుగుతోంది. మాటల్లో పదును కూడా అంతే పెరుగుతోంది. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీని ఒకవైపు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అంటూ కాంగ్రెస్‌ పూర్తి ధీమాతో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement