హైదరాబాద్, ఆంధ్రప్రభ : రైతుల సమస్యల పరిష్కారం కొరకు రైతులతో కలిసి భారీ పోరాటానికి శ్రీకారం చుట్టాలని టీ పీసీసీ నిర్ణయించింది. సీఎం కేసీఆర్ రైతులకు చేస్తున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి యాసంగిలో ఉద్యమం చేయాలని, అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయించారు. గురువారం గాంధీభవన్‌లో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతాంగ సమస్యలు, ధరణి ఫోర్టల్ , రైతు రుణమాఫీ , పంటలపై పెడుతున్న ఆంక్షలతో పాటు తదితర రైతుల అంశాలపై చర్చించారు. ఈ నెల 5న రైతు సమస్యలపై వ్యవసాయ కమిషనర్‌కు, 7న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు కలిసి గవర్నర్‌కు వినతిపత్రాలు ఇవ్వాలని, 13న కొల్లాపూర్‌లోలో జరిగే ‘ మన ఊరు- మన పోరు’ సమావేశంలో వ్యవసాయ రైతు సమస్యలపై తీర్మానాలు, 20న కామారెడ్డిలోనూ భారీగా సభ నిర్వహించాలని, నిర్ణయించారు. అసెంబ్లిdలోనూ వాయిదా తీర్మానం పెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ వరి కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రణాళిక చేపట్టాలని సూచించారు. ఐకేపీ కేంద్రాల ఏర్పాటు, లారీల కాంట్రాక్టు, రైసు మిల్లర్లకు టార్గెట్ ఏర్పాటు చేయాలన్నారు. ముందస్తు సన్నహక ఏర్పాటు చేయాలని, లేకపోతే రైతులను ఇబ్బందులు వస్తాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమావేశం ఏర్పాటు చేసి వరి కొనుగోళ్ల ప్రక్రియను తొందరగా ప్రారంభించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సమస్యలు సృష్టించి కేంద్రంతో కొట్లాడుతున్నట్లు రాజకీయం చేస్తున్నారని, ఢిల్లిలో రైతు ఉద్యమ నాయకుడు తియాకత్‌లో కలిసి డ్రామాకు తెరలేపారని ఆయన విమర్శించారు. ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి మాట్లాడుతూ ఖరిఫ్‌లో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తుఫాన్ వల్ల వరి ధాన్యం తడిసిందని, రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తే రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేశారని ఆయన పేర్కొన్నారు.
యాసింగిలో వరి వేయద్దని ప్రభుత్వం ప్రచారం చేయడంతో వరి విస్తీర్ణం బాగా తగ్గిందన్నారు. వరి కొనుగోలు అంశంతో పాటు నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ, పసుపు, ఖమ్మంలో మిర్చి తదితర అంశాలపై కూడా పోరాటం చేయాలన్నారు. రైతుల సమస్యలపై అసెంబ్లిdలో స్వల్పకాలిక చర్చ కోసం పట్టుపట్టాలని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ సూచించారు. పంటలకు నష్టం జరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహకారం అందలేదన్నారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చినా ఎలాంటి సహాయం ఇవ్వలేదన్నారు. ఈ సమావేశంలో టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, అధికార ప్రతినిధి రాంచంద్రారెడ్డి, ఎస్సీసెల్ డిపార్ట్‌మెంట్ చైర్మన్ ప్రీతం తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు.
8 ఏళ్లుగా పరాయి పాలనలోనే మగ్గుతున్నాం: సీఎం కేసీఆర్‌కు టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, మేధావి వర్గం పరిపాలనలో భాగస్వామ్యం అవుతుందని ఆశించాం, కానీ ఎనిమిదేళ్లుగా పరాయి పాలనలోనే మగ్గుతున్నామని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు విషయంలో అన్యాయం జరుగుతోందని, కీలకమైన శాఖలు బీహార్‌కు చెందిన అధికారుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన అధికారులు నిరాధరణకు గురవుతున్నారని, కేసీఆర్ చుట్టు బీహార్ అధికారులే ఉన్నారన్నారు. రాష్ట్రంలో 157 ఐఏఎస్‌లు, 139 మంది ఐపీఎస్‌లు ఉండగా బీహార్ అధికారులను అందలం ఎక్కించడం వెనుక ఆంతర్యమేమిటన్నారు. హెచ్‌ఎండీఏ, రేరాకు సోమేష్‌కుమార్, అరవింద్‌కుమార్‌లు ఇచ్చిన అనుమతులపై సమగ్ర విచారణ జరిపించాలని, జయేష్‌రంజన్ సారధ్యంలో టీఎస్‌ఐఐసి ద్వారా జరిగిన భూ కేటాయింపులపైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.