Tuesday, November 26, 2024

బిఆర్ఎస్ తో పొత్తు లేదూ…సీట్ల స‌ర్దుబాటు లేదు – తేల్చేసిన కాంగ్రెస్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలం గాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టత నిచ్చారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో ఎటు-వంటి పొత్తు ఉండదని రాహుల్‌ కుండబద్దలు కొట్టారు. పొత్తు ఉండదన్న అంశాన్ని పార్టీ శ్రేణులకు వివరించి చెప్పాలని ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు చెప్పారు. కర్ణాటకలో ఎన్ని కల ప్రచారం ముగించుకొని ఢిల్లీ వెళ్తూ మార్గ మధ్యంలో హైదరాబాద్‌ శంషాబాద్‌ విమా నాశ్రయంలో ఆగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌ రావ్‌ ఠాక్రే, పీసీసీ- అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర పార్టీ ముఖ్యులు, నేతలు రాహుల్‌ గాంధీకి స్వాగతం పలికారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, భారాస పాలన, పార్టీ బలోపేతంపై తీసుకున్న, తీసుకోబోతోన్న చర్యలు, పార్టీలో చేరికలు తదితర అంశాలపై మాణిక్‌రావ్‌ ఠాక్రే, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రాహుల్‌తో చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటు-పై కాంగ్రెస్‌ పార్టీ నేతలెవ్వరూ బహిరంగంగా మాట్లాడవద్దని రాహుల్‌ చెప్పినట్టు- సమాచారం. భారాసతో పొత్తు ఉండదన్న విషయాన్ని పార్టీ శ్రేణులకు నా మాటగా చెప్పండి అంటూ రాహుల్‌ మాణిక్‌ రావ్‌ ఠాక్రే, రేవంత్‌ రెడ్డిలను కోరినట్టు- సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. అందరు నేతలు కలిసికట్టుగా పని చేయాలని ఆయన సూచించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రేవంత్‌ పాదయాత్రలపై కూడా ఈ భేటీ-లో చర్చించారు. పాదయాత్రలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, భారాస పాలనతో తాము ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నామో ప్రజలు వివరించి వేదనకు గురైన విషయాన్ని చెబుతున్నారని రేవంత్‌ రాహుల్‌కు వివరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్ఠి సారించాలని, తెలంగాణాలో అధికార పార్టీ భారాసకు ఎదురుగాలి వీస్తోందని, ఎన్నికల నాటికి మరింత బలహీనపడుతుందని రాహుల్‌ గాంధీ చెప్పినట్టు- సమాచారం. ఎన్నికలయ్యేదాకా పార్టీ నేతలంతా ప్రజల్లోనే ఉంటూ తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని, పేపర్‌ లీకేజీల అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చనీయాంశం చేయాలని కోరారు. రాష్ట్రంలో భాజపాకు ప్రజల నుంచి ఏ మాత్రం ఆదరణ రావడం లేదని, ఆ పార్టీ రాష్ట్రంలో కొన్ని నియోజక వర్గాలకే పరిమితమైందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రాహుల్‌కు వివరించినట్టు- సమాచారం.

తెలంగాణకు వస్తూనే ఉంటా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిన సత్వరమే తెలంగాణాలో పర్యటిస్తానని రాష్ట్ర నేతలకు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్‌దే విజయమని, తెలంగాణలోనూ పాగా వేయబోతున్నామని రాష్ట్ర నేతలతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ చెప్పినట్టు- సమాచారం. దక్షిణాదిలో కాంగ్రెస్‌ అన్ని రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరవేయడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించినట్టు- సమాచారం. వచ్చే నాలుగు మాసాలు కీలకమని, ఎన్నికలయ్యేదాకా తెలంగాణలోనే ఉంటూ పరిస్థితిని చక్కబెట్టాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రేను రాహుల్‌ కోరారు. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని కూడా ఆయన చెప్పారన్న ప్రచారం జరుగుతోంది.

కుల గణన చేపట్టాలని కేంద్రానికి లేఖలు రాయండి ‍ ఠాక్రే, రేవంత్‌కు రాహుల్‌ గాంధీ దిశా నిర్దేశం
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీదర్‌ జిల్లా బాల్కి పట్టణంలో ఎన్నికల ప్రచారం ముగించుకున్న రాహుల్‌ గాంధీ సోమవారం హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానంలో ఢిల్లిd బయలుదేరి వెళ్లారు. విమానాశ్రయంలో ఆయనకు ఎఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, ఎఐసీసీ కార్యదర్శులు రోహిత్‌ చౌదరి, నదీమ్‌ జావిద్‌, సీనియర్‌ నేత మధుయాష్కీ గౌడ్‌ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో గెలుపుపై నేతలకు రాహుల్‌ దిశా నిర్దేశం చేశారు. కుల గణనను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని, ఈ విషయంలో బీజేపీ సర్కార్‌ నిర్లక్ష్యాన్ని గ్రామగ్రామాన చాటాలని కూడా రాహుల్‌ కోరారు. కుల గణనపై పార్లమెంట్‌ ఉభయ సభలతో పాటు బయట కూడా ఈ అంశాన్ని పార్టీ లేవనెత్తిందని, ఎఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే కులగణను చేపట్టాలని కేంద్రానికి మరోమారు లేఖ రాశారని కూడా రాహుల్‌ పీసీసీ నేతలకు చెప్పారు. నేతలకు గుడ్‌ లక్‌ చెబుతూ రాహుల్‌ ఢిల్లి బయలుదేరి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement