Thursday, November 21, 2024

ఆర్టికల్ 370 రద్దు.. దిగ్విజయ్ వ్యాఖ్యలపై దుమారం

ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 రద్దు అంశంపై పునరాలోచిస్తామని దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంది. ఆర్టికల్ 370 రద్దు చేయడం, జమ్ముకశ్మీర్​ను కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించడం బాధాకరమని దిగ్విజయ్ పేర్కొన్నారు. ‘క్లబ్ హౌస్’ చాట్ లో ఓ పాకిస్థానీ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు దిగ్విజయ్ పైవిధంగా బదులిచ్చారు. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు కశ్మీర్​లో ప్రజాస్వామ్యం, మానవత్వం నశించాయని.. ప్రతి ఒక్కరినీ నిర్బంధించారని అన్నారు. ప్రభుత్వ సర్వీస్​లలో కశ్మీర్ పండిట్లకు రిజర్వేషన్లు ఉండేవని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ విషయంపై తప్పక దృష్టిసారిస్తుందని పేర్కొన్నారు.

దీంతో దిగ్విజయ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ జవాబు చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు. గతంలో పుల్వామా ఉగ్రదాడిని ప్రమాదంగా పేర్కొన్నారని, ఇప్పుడు పాక్ తో చేతులు కలిపి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషం కక్కుతున్నారని విమర్శించారు. కాగా, జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జమ్మూకశ్మీర్ ను రెండు రాష్ట్రాలుగా విభజించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement