కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లా అదనపు మున్సిప్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 3వ తేదీన కోర్టు ముందు స్వయంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కాగా, పార్టీకి చెందిన బ్లాక్ కమిటీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ సమన్లు జారీ కావడం గమనార్హం.
తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తే పార్టీ బ్లాక్ కమిటీ కార్యదర్శి పృధ్విరాజ్ పి. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీతో పాటు, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడు కె. సుధాకరన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ చీఫ్ పి. రాజేంద్ర ప్రసాద్ కూడా హాజరుకావాలని నోటీసు జారీ చేసింది. తన సస్పెన్షన్ భారత జాతీయ కాంగ్రెస్ నిబంధనలకు విరుద్ధమని, అందుకని తనను పార్టీలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది బోరిస్ పాల్ ద్వారా పృధ్విరాజ్ కేసు దాఖలు చేశాడు.
2019లో పార్టీ నుంచి సస్పెండ్ అయిన పృధ్విరాజ్.. తాను 25 ఏళ్లుగా పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నానని, కొల్లంలోని కుందర బ్లాక్ కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశానని ఆ పిటిసన్‌లో పేర్కొన్నాడు. అయితే పార్టీ నుంచి తనను అక్రమంగా సస్పెండ్ చేశారని, సస్పెన్షన్‌కు సంబంధించిన ఏ ఉత్తర్వు కూడా తనకు రాలేదని కోర్టుకు విన్నవించాడు.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాసర్‌గోడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాజ్‌మోహన్ ఉన్నితాన్ ఎన్నికల ప్రచారంలో తాను చురుకుగా పాల్గొన్నానని పృధ్విరాజ్ పేర్కొన్నాడు. ప్రచార సమయంలో కొన్ని అపార్థాలు రావడంతో ఉన్నితాన్ తనపై ఆరోపణలు చేశారని, అంతేకాకుండా కొల్లం కాంగ్రెస్ కమిటీ చీఫ్‌కి ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. ఆ ఫిర్యాదుపై స్పందించిన డీసీసీ అధ్యక్షుడు తనను సస్పెండ్ చేసినట్లు ఆ తర్వాత పత్రికల్లో వచ్చిందన్నారు.