Tuesday, November 26, 2024

BC Slogan – కాంగ్రెస్‌లో ఇంట‌ర్న‌ల్ ఫైట్‌ – అధిక సీట్లకోసం బిసిల పట్టు ..

అధిక లోక్‌స‌భ సీట్ల కోసం బీసీల ప‌ట్టు
అసెంబ్లీ స‌మ‌యంలో మాట త‌ప్పారని ఆగ్ర‌హం
ఇప్పుడైన స‌రిదిద్దుకోవాలంటున్న‌ బీసీ నేత‌లు
పీసీసీ చీఫ్ రేవంత్‌పై పెరుగుతున్న ఒత్తిడి
కులగ‌ణ‌న అంటూ కుల‌పోళ్ల‌కు సీట్లు ఇవ్వ‌రా?
17లో ఆరు నుంచి ఏడు స్థానాలు ఇవ్వాల్సిందే
ఇప్ప‌టికే తొమ్మిది ప్ర‌క‌టిస్తే బీసీల‌కు ద‌క్కేది రెండే
ఇప్పుడుకాకుంటే ఇంకెప్పుడూ సాధించుకోలేం
కాంగ్రెస్ పార్టీలోని బీసీ లీడ‌ర్ల ఆవేద‌న

తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కనీసం ఆరు లోక్‌స‌భ‌ స్థానాలు బీసీలకు ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి మాట ఇచ్చి తప్పారని మండిప‌డుతున్నారు. ప్రతి లోక్‌స‌భ‌ పరిధిలో రెండు అసెంబ్లీ సీట్ల చొప్పున బీసీలకు 34 సీట్లు కేటాయిస్తామని మాటిచ్చారని, తీరా ఎన్నికల సమయానికి కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చారంటున్నారు. ఇక‌.. అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేసి సామాజిక న్యాయం చేస్తామని రాహల్‌ గాంధీ చెబుతుంటే.. తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం బీసీలకు తగిన ప్రాధాన్యం లేదని వీహెచ్ వంటి సీనియర్లు వాపోతున్నారు. మరోవైపు బీజేపీ ఐదు స్థానాలు, బీఆర్‌ఎస్ ఆరు స్థానాలు బీసీలకు కేటాయించాయి. దీంతో కాంగ్రెస్‌పై కూడా బీసీ నేతలు మెజారిటీ సీట్లు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నారు.

9 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటివరకు తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో రెండు ఎస్సీ, ఒకటి ఎస్టీ రిజర్వుడు స్థానాలకు అభ్యర్థుల పేర్లు వెల్ల‌డించింది. మిగతా ఆరు స్థానాల్లో కేవలం రెండు మాత్రమే బీసీలకు కేటాయించింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్‌, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్‌కు అధిష్టానం అవకాశమిచ్చింది. ఇంకా ఎనిమిది స్థానాలు పెండింగ్‌లో ఉండటంతో… వీటిలో కనీసం నాలుగు స్థానాలు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీసీ అభ్యర్థి నీలం మధు పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అలాగే.. బీసీలకు మరో మూడు చోట్ల అవకాశం కల్పించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం టికెట్ కోసం సీనియర్ నేత వి.హనుమంతరావు పోరాటం చేస్తున్నారు.

భువ‌న‌గిరి, నిజ‌మాబాద్ బీసీల‌కే…

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క బీసీకి కూడా టికెట్ ఇవ్వలేదని..ఇప్పుడు లోక్‌స‌భ ఎన్నికల్లో బీసీలకు అవకాశం కల్పించాలని బీసీ నేత‌లు కోరుతున్నారు. అలాగే.. భువనగిరి నుంచి పున్న కైలాష్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ బీసీలకు టికెట్ ఇస్తే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కోమటిరెడ్డి బ్రదర్స్ బహిరంగంగా చెబుతున్నారు. నిజామాబాద్ నుంచి బీసీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు టికెట్ ఇవ్వాలని పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సూచిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ లోక్‌సభ ఎన్నికల్లోనే న్యాయం జరగాలనే బీసీ నేతల బిగ్‌ డిమాండ్‌పై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement