తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎంపీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురుని నియమించింది. అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్‌గౌడ్‌లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీని నియమించింది. ప్రచారకమిటీ కన్వీనర్‌గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యాచరణ అమలు కమిటీ చైర్మన్‌గా మహేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు. సీనియర్ ఉపాధ్యక్షులుగా సంభాని చంద్రశేఖర్, దామోదర్‌రెడ్డి, మల్లు రవి, పొదెం వీరయ్య, సురేష్ షెట్కార్, వేం నరేందర్‌రెడ్డి, రమేష్ ముదిరాజ్, గోపీశెట్టి నిరంజన్, టి.కుమార్‌రావు, జావెద్ అమీర్‌లను ప్రకటించింది.
రేవంత్‌కు పీసీసీ పగ్గాలు ఇవ్వొద్దంటూ కొందరు సీనియర్లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా.. హైకమాండ్ మాత్రం రేవంత్ వైపే మొగ్గు చూపింది. టీఆర్ఎస్‌పై ఎప్పుడూ దూకుడుగా ఉండే రేవంత్.. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా మారారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రావాలంటే రేవంత్ లాంటి మాస్ లీడరే అధ్యక్షుడిగా ఉండాలని పార్టీ భావించినట్లు తెలుస్తోంది.