హైదరాబాద్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీలో పాదయాత్రల జోరు పెరుగుతోంది. ప్రజల నుంచి కూడా మంచి స్పందనే లభిస్తోంది. దీంతో పార్టీ కేడర్‌లోనూ మరింత జోష్ పెరుగుతోంది. ఒక వైపు హాత్ సే హాతో జోడో అభియాన్ యాత్రలో భాగంగా ‘యాత్ర ఫర్ చేంజ్’ పేరుతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గత నెల నుంచి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మరో వైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ‘పీపుల్స్ మార్చ్’ పేరుతో అదిబాలాబాద్ జిల్లా భోథ్ నియోజక వర్గం పిప్పిరిలో గురువారం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి ”అదిలాబాద్ టూ హైదరాబాద్” చేపట్టిన పాదయాత్రను మాత్రం మూడు రోజుల వ్యవధిలోనే నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇద్దరు నాయకులు యాత్రలు చేసే విధంగా పార్టీ అధిష్టానమే ప్లాన్ చేసిందని, అందులో పెద్ద లెక్కనే ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
భవిష్యత్తులోనూ ఎవరు యాత్రలు చేసినా.. వారు వ్యక్తిగతంగా ఇమేజ్ పెరగడానికి కాకుండా.. పార్టీకే మైలేజ్ వచ్చే విధంగా కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకు ఈ ఇద్దరు నాయకుల యాత్రలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే పలు సూచనలు చేస్తూ ముందుండి నడిపిస్తున్నారు. అవసరమైతే పార్టీ సీనియర్లు కూడా తమ తమ సొంత నియోజక వర్గాల్లో కూడా ఎవరికి వారుగా యాత్రలు చేయాలని కూడా మాణిక్‌రావు ఠాక్రే సూచించారు. దీంతో కొందరు నాయకులు అక్కడక్కడా అడపాదడపా యాత్రలు కొనసాగిస్తున్నారు. దీనికి కారణం రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్లు.. జూనియర్లతో పాటు పాత, కొత్త పంచాయతీ నెలకొనడమే ప్రధాన కారణమని, ఈ యాత్రలో వాటన్నింటికి చెక్ పడుతోందన్న భావనలో ఉన్నారు.
కాగా, పార్టీ పదవుల పంపకాల విషయంలో కొందరు సీనియర్లకు అన్యాయం జరిగిందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి,
అప్పటి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్‌పైనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో కొందరు నాయకులు తిరుగుబాటు చేయగా.. అప్పుడు పార్టీ రెండుగా చీలిపోయిందనే ప్రచారం జరిగింది. వెంటనే అధిష్టానం జోక్యం చేసుకోవడం.. నాయకులందరితో చర్చించి సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆ పంచాయతీ తాత్కాలికంగా సద్దుమణిగింది. పార్టీ నాయకులందరం ఒక్కటేనని సంకేతాలు ఇచ్చే ప్రయత్నం కూడా జరిగింది. అయినప్పటికీ నాయకుల మధ్య విబేదాలు, గ్రూప్‌ల లొల్లి ఏమాత్రం తగ్గలేదని, అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ నాయకులే రుజువు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, పీసీసీ అధ్యక్షుడు రేవవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా యాత్ర ఫర్ చేంజ్ పేరుతో ఫిబ్రవరి 6వ తేదీన పాదయాత్రను ప్రారంభించారు. మొదటి విడతగా ఆరు పార్లమెంట్ నియోజక వర్గాల్లో వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, నిజమాబాద్, జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలోని 42 నియోజక వర్గాల్లో యాత్ర చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గాల్లో పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రేవంత్ యాత్ర కొనసాగుతోంది. అయితే రేవంత్‌రెడ్డి యాత్రకు ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు మరి కొందరు సీనియర్లు దూరంగానే ఉన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత వి. హనుమంతరావుతో పాటు యాత్ర జరుగుతున్న ప్రాంతాల నాయకులు రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు.
కాగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర కూడా దాదాపు 40అసెంబ్లిd నియోజక వర్గాల్లో కొనసాగనుంది. ఉమ్మడి అదిలాబాద్‌లోని బోథ్ నియోజక వర్గంలో ప్రారంభమైన ఈ యాత్ర ఖమ్మం జిల్లాలో ముగుస్తుంది. ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలో యాత్ర కొనసాగుతుంది. అందుకు పార్టీ శ్రేణులందరు హాజరై.. పాదయాత్రను విజయవంతం చేయాలని నాయకులందరికి అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దీంతో భట్టి యాత్రకు ఏఐసీసీ నాయకులు, ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు హాజరుకావడంతో పాటు సభలు విజయవంతమయ్యేలా చూస్తున్నారు.
వైఎస్‌ఆర్ అనుభవాన్ని గుర్తు చేసుకుంటున్న అధిష్టానం
కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. పార్టీలో ఎన్ని గ్రూప్‌లు ఉన్నా.. వారందరిని ప్రోత్సహించి అందరికి అవకాశాలు ఇచ్చే సంస్కృతి పార్టీలో ఉండేది. అది 2004 ఎన్నికల తర్వాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక.. రాష్ట్రంలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. వైఎస్ అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే వైఎస్‌ఆర్‌లాగ పరిస్థితి మారిపోయింది. దీనికంతటికి వైఎస్‌ఆర్‌కు అధిష్టానం పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడమే ప్రధాన కారణమని చర్చ ఇప్పటికీ జరుగుతోంది. దీంతో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మెజార్టీగా పార్టీ నాయకులు వైఎస్‌ఆర్ తనయుడు వైసీపీ నేత జగన్ వైపు వెళ్లిపోవడంతో అక్కడ పార్టీ పూర్తిగా నష్టపోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో క్షేత్ర స్థాయిలో పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పటికి నాయకుల మధ్య నెలకొన్న లొల్లితో నష్టం జరుగుతుందనే అంశాన్ని గుర్తించిన అధిష్టానం.. నాయకులందరూ ముందుగా జనంలోకి వెళ్లే విధంగా ప్లాన్ చేశారు.
ఒక వ్యక్తితో యాత్ర చేయడం వల్ల పార్టీకి కాకుండా ఆయనకే మైలేజ్ వస్తుందని, అందుకు మరో సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో రేవంత్‌రెడ్డికి ప్రత్యామ్నా యంగా సీఎల్పీ నేత భట్టిని అధిష్టానమే రంగంలోకి దింపిం దని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరు నాయకులు చేస్తున్న యాత్రలతో వస్తున్న మైలేజీ పార్టీ ఖాతాలో పడే విధం గా అధిష్టానం జగ్రత్త పడుతోందన్న చర్చ జరుగుతోంది.