హైెదరాబాద్, ఆంధ్రప్రభ : రైతు ఏడ్చిన రాజ్యాం.. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు ‘ అనే నానుడిని రాజకీయ పార్టీలు ఒంటపట్టించుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే రైతు జపం చేయాలని.. అందుకు రైతు సమస్యలనే ప్రధానంగా ఎజెండాగా చేసుకుని ముందుకు వెళ్లాలనే యోచనలో పార్టీలన్ని ఉన్నాయి. ప్రధానంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కాస్త ముందుగానే రైతు ఎజెండాతో జనంలోకి వెళ్లుతోంది. రైతుకు భరోసా ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ గట్టేక్కడానికి అవకాశం ఉంటుందని, ఒక వైపు సంక్షేమం, అభివృద్ది అంశాలను ప్రస్తావిస్తూనే మరో వైపు రైతు చుట్టే రాజకీయం చేయాలనే ఆలోచనలో హస్తం పార్టీ నేతలున్నారు. ఇదే అంశాన్ని ఇటీవల జరుగుతున్న వివిధ కమిటీల్లోనూ నాయకుల మధ్య రైతు అంశాలనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. రైతు అంశాలపై ఏఐసీసీకి టీ పీసీసీ ఫీడ్ బ్యాక్ ఇవ్వగా.. ఏఐసీసీ కూడా ఆమోదం తెలిపి ముందుకు వెళ్లాలని సూచించింది.
ఒక వైపు రైతు రుణమాపీ రూ. 2 లక్షలు ఇస్తామని.. గతేడాది మే నెలలో వరంగల్‌లో నిర్వహించిన రైతు గర్జనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీనే స్వయంగా ప్రకటించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే రూ. 6 లక్షలు దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. అంతే కాకుండా రైతులకు మేలు చేసేందుకు గాను మరిన్ని పథకాలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందుకు వివిధ రాష్ట్రాల్లోని అమలు జరుగుతున్న పథకాలను అధ్యయనం చేసే బాధ్యతను కిసాన్ కాంగ్రెస్‌కు టీ పీసీసీ అప్పగించింది. రైతుకు మేలు చేసే పథకాలు వివిధ రాష్ట్రాల్లో ఏమున్నాయయి..? పాలసీలు ఎలా ఉన్నాయి..? ఏ పంటకు ఎంత మద్దతు ధర అమలు జరుగుతోంది..? అనే కోణంలో కిసాన్ కాంగ్రెస్ నాయకులు ఆరా తీయడమే కాకుండా వివిధ ఎజెన్సీలతో అధ్యయనం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీష్‌ఘడ్ రాష్ట్రంలో వరికి మద్ధతు ధర ఎక్కువగా ఉందని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇటీవలనే కరీంనగర్లో జరిగిన కాంగ్రెస్ సభకు ఛత్తీష్‌ఘడ్ సీఎం భూపేష్భాగల్ను ఆహ్వానించి.. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి చేపడుతున్న అభివృద్ధిని వివరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ రూ. 2 లక్షల పక్కాగా అమలు చేస్తామని ఏఐసీసీతో పాటు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. వరంగల్ డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత తానే చూసుకుంటానని రాహుల్‌గాంధీ కూడా గతంలోనే ప్రకటించారు. దీంతో పాటు ఇందిరమ్మ రైతు భరోసా కింది ప్రతి ఏకరానికి పంట సహాయం కింద ఆర్థిక సహాయం చేయాలని ప్రణాళికలో పెట్టుకున్నారు. భూమిలేని రైతులకు సైతం ప్రతి ఏటా రూ. 12 వేలు అందించాలని తీర్మానం చేశారు. వీటితో ఉత్తర తెలంగాణ రైతుల్లో బలంగా ఉన్న పసుపు బోర్డును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏర్పాటు చేస్తామనే హామీతో ముందుకెళ్లందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. పసుపు బోర్డు హామీని బీఆర్ఎస్, బీజేపీలు ఇచ్చిన హామీని అమలు చేయకుండా నిజామాబాద్ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. పసుపుబోర్డు నినాదంతో ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందనే ఆశతో హస్తం నేతలున్నారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఓటమి చెంది.. బీజేపీ నుంచి అరవింద్ గెలవడానికి పసుపు నినాదమే ప్రధాన కారణమని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా రైతు బీమాను కొనసాగిస్తూనే, ఈ పథకానికి అదనంగా రైతు ఆత్మగౌరవంతో బతికేలా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా కమిషన్ తరహాలో రైతుల కోసం ‘ రైతు కమిషన్ ‘ ఏర్పాటు చేస్తామని, దానిలో రైతుల సమస్యలు వేగంగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పేదలు ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇస్తున్నారు.
- కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా రూ. 6 లక్షలు రుణమాఫీ,
రాష్ట్ర పరిధిలో ( కేవలం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ) రూ. 2 లక్షల వరకు రుణమాఫీ అమలు - పంటలకు మద్దతు గ్యారంటీ చట్టం
- వ్యవసాయ కమిషన్ ఏర్పాటు
- ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలు.. జాతీయ ఇన్స్‌రెన్స్ కంపెనీలతో ఒప్పందం
- రైతు ఆదాయం పెంచేందుకు ఒక చట్టబద్దమైన ప్రణాళిక, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలకు గోదాముల ఏర్పాటు
- భూ సేకరణ చట్టం – 2013 పకడ్బందిగా అమలు
- ఉపాధి హామీ పథకం పకడ్బందిగా అమలుతో పాటు పని దినాల పెంచడం.
- వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతికి అవకాశాలు పెంచడం
- ఢైరీ, హార్టికల్చర్, కోళ్ల ఫారాలకు సబ్సిడీలన పెంచడం
- కౌలు రైతులకు ఆదుకుంటామని హామీ
- ధరణి చట్టాన్ని రద్దు చేసి.. ఇబ్బందుల పడుతున్న రైతులకు విముక్తి కల్పించే విధంగా హామీ.
- రైతులు, రైతు కూలీలకు హెల్త్, లైఫ్ ఇన్స్‌రెన్స్ సౌకర్యాలు.