కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో పోలీసు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈమేరకు కాంగ్రెస్ చీఫ్, పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సీనియర్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లలో కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈనెల 11న ఉత్తరాఖండ్‌లో జరిగిన ర్యాలీలో హిమంత బిస్వా మాట్లాడుతూ సెప్టెంబర్ 2016న జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కు రుజువు కావాలని రాహుల్ గాంధీ అడిగారు.. మరి తాను మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడని రుజువు చేయాలని బీజేపీ ఎప్పుడైనా డిమాండ్ చేసిందా? అని ప్రశ్నించారు. దీంతో రెండ్రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఈ విషయమై నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అనేక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసింది.
అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని ఫిర్యాదుదారులు ఆరోపిస్తూ హిమంత బిస్వా శర్మపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153-A, 505 (2), 294 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను అభ్యర్థించారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి అస్సాం సీఎంపై ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు సమాచారం. అంతేకాకుండా మహిళలను కించపరిచేలా అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించి వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.