విదేశాలతో పోలిస్తే.. భారత్‌లో కరోనా వ్యాప్తి తక్కువే ఉందని, అయినా ఆయా రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధికారులకు సూచించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుతం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్య శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో మన్సుఖ్ మాండవీయ ఆన్‌లైన్ వేదికగా సమావేశం అయ్యారు. ఒమిక్రాన్ వ్యాప్తి, వైద్య సదుపాయాలు, ముందస్తు డోసులు, 15 నుంచి -18 ఏళ్ల వారికి టీకాల పంపిణీ వంటి కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. విదేశాల్లో మునుపటి వేవ్‌తో పోలిస్తే.. ప్రస్తుతం కేసుల పెరుగుదల 3-4 రెట్లు అధికంగా ఉందన్నారు.
ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ అన్నారు. కఠినమైన ఆంక్షలు అమలు చేయాలని, అప్పుడే కరోనా కట్టడికి వీలవుతుందని స్పష్టం చేశారు. రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలని, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించారు. కరోనాపై పోరాటంలో దేశ ప్రజలను భాగసామ్యం చేయాలన్నారు. గతంలో ఎదురైనా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అవి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. వారానికి సంబంధించి ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు వెళ్లాలని, త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. 15,-18 ఏళ్లలోపు వారికి టీకాల కోసం ఎన్ని డోసులు అవసరమో కూడా వివరాలు సమర్పించాల్సిందిగా సూచించారు. ఎమర్జెన్సీ కొవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ నిధుల్లో 17 శాతమే ఖర్చు చేశారని, బెడ్‌ల ఏర్పాటు తదితర మౌలిక వసతుల కోసం వాటిని వినియోగించాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..