Monday, November 18, 2024

Fuel Matter | ఇంధన ధరలు తగ్గించలేమన్న కంపెనీలు

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, దేశీయంగా వీటి ధరలు మాత్రం తగ్గడంలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గడం వల్ల కంపెనీలకు పెట్రెల్‌, డీజిల్‌ అమ్మకాలపై మార్జిన్లు పెరుగుతున్నాయి. గత సంవత్సర కాలంగా చమురు కంపెనీలకు వచ్చిన నష్టాలు పూర్తిగా తగ్గిన తరువాతే అంతర్జాతీయ రేట్ల ప్రకారం ఇక్కడ సవరింపులు ఉంటాయని చమురు సంస్థలు స్పష్టం చేశాయి.

ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ (ఐఓంసీ) భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ (బీపీసీఎల్‌), హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా సవరించడంలేదు. ద్రవ్యోల్బణం నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం వీటి ధరలను సవరించవద్దని కోరడంతో కంపెనీలు అందకు సహకరిస్తూ వస్తున్నాయి. ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో దేశీయ మార్కెట్‌లో వాటి రేట్లను కంపెనీలు సవరించకపోవడంతో భారీగా నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి.

దీని వల్ల ప్రస్తుతం కంపెనీలకు డీజిల్‌, పెట్రోల్‌ అమ్మకాలపై మార్జిన్లు పెరుగుతున్నాయి. అప్పుడు వచ్చిన నష్టాలను ప్రస్తుతం పూడ్చుకుంటున్నాయి. డీజిల్‌ పై మాత్రం ఎక్కువ మార్జిన్లు రావడంలేదని చమురు సంస్థలు చెబుతున్నాయి. డీజిల్‌ అమ్మకాలపై లీటర్‌కు 50 పైసలు మాత్రమే మార్జిన్‌ వస్తున్నందున ఇది నష్టాలు పూడ్చుకునేందుకు సరిపోవడంలేదని తెలిపాయి.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంలో 2022 మార్చిలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురుధర బ్యారెల్‌కు 139 డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం ఇది 75-76 డాలర్లకు పడిపోయింది. వీటి ధరలు భారీగా ఉన్న సమయంలో కంపెనీలు లీటర్‌ డీజిల్‌ పై 27.7 రూపాయలు, లీటర్‌ పెట్రోల్‌పై 17.4 రూపాయల చొప్పున నష్టపోయాయి. 2023 జనవరి-మార్చి కాలంలో చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 6.8 రూపాయలు, డీజిల్‌ పై 0.50 రూపాయల మార్జిన్లు ఆర్జించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement