ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. వంట గ్యాస్ ధర భారీగా తగ్గింది. సిలెండర్‌పై ఏకంగా రూ. 91 రూపాయల వరకూ తగ్గింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2022ను ప్రవేశపెట్టిన వేళ.. చమురు మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రతి నెలా 1వ తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ ధరల్లో సమీక్ష చేస్తుంటాయి. ఈ క్రమంలోనే నేడు ధరలు తగ్గించాయి.
దేశంలో గృహ వినియోగదారుల కోసం 14.5 కేజీల ఎల్పీజీ సిలెండర్, వాణిజ్యపరంగా ఉపయోగించే 19 కిలోల కమర్షియల్ సిలెండర్ అందుబాటులో ఉన్నాయి. 19 కిలోల వాణిజ్య సిలెండర్ ధరను భారీగా తగ్గింది. కమర్షియల్ సిలెండర్ ధరను 91 రూపాయలు 50 పైసలు తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలెండర్ ధర రూ. 1907కి చేరింది. అయితే, డొమెస్టిక్ సిలెండర్ ధరల్లో మాత్రం ఏ విధమైన మార్పు లేదు. గత నెలలో ఉన్న ధరలే కొనసాగనున్నాయి. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ధరల తగ్గింపును కొనసాగించింది.