Friday, November 22, 2024

Spl Story: న్యాయమూర్తుల నియమాకాలలో కొలీజియం సిఫార్సులు.. తెలుసుకోవాల్సిన విషయాలు!

భారతదేశంలో న్యాయమూర్తుల నియామకం ‘కొలీజియం ’ వ్యవస్థ ద్వారానే జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న ‘కొలీజియం’ స్థానంలో ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌’ (ఎన్‌జెఎసి) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆ మధ్య నిర్ణయం తీసుకుంది. అయితే.. దీని వాదోపవాదాలు సుప్రీం కోర్టుకు చేరాయి. ఈ కేసులో న్యాయమూర్తుల నియామకంలో ‘కొలీజియం’ వ్యవస్థ కొనసాగింపునకే సుప్రీంకోర్టు మొగ్గు చూపింది. ఈ మేరకు కేంద్రం నిర్ణయం సరైంది కాదని, కొలీజియం ఉండాల్సిందేనని స్పష్టమైన తీర్పును వెలువరించింది. ఆ వింటో చదివి తెలుసుకుందాం..

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

‘సుప్రీం కోర్టుకు న్యాయమూర్తులను, హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను, న్యాయమూర్తులను నియమించే వ్యవస్థ, విధానం, 99వ రాజ్యాంగ సవరణ చట్టానికి ముందు ఉన్నట్లుగానే కొలీజియం వ్యవస్థ పనిచేస్తుందని ప్రకటిస్తున్నాం’ అని అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్స్‌, భారత ప్రభుత్వం కేసులో జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జెఎసి) ఏర్పాటు రాజ్యాంగబద్ధం కాదని ఈమధ్య జస్టిస్‌ ఖేహార్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 నిష్పత్తిలో సంచనాత్మక తీర్పు వెలువరించింది. దీంతో దేశ వ్యాప్తంగా న్యాయకోవిదులు, రాజకీయ అగ్రనాయకులు, కేంద్ర మంత్రులతో పాటు సాధారణ ప్రజానీకం కూడా ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ  స్వతంత్ర న్యాయ వ్యవస్థల మధ్య తలెత్తిన రాజ్యాంగపరమైన అంశాలపై చర్చలకు తెరతీశారు.

ఒక న్యాయమూర్తిని నియమించాలని ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌’ చేసే సిఫార్సును ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తమ వీటో అధికారం ద్వారా ఎలాంటి కారణాలు పేర్కొనకుండానే అడ్డుకోవచ్చు. వారు ఏ కారణం లేకుండానే న్యాయమూర్తుల నియామకాన్ని ఆపేసే చాన్స్​ కూడా ఉంటుంది. తరచూ ఇట్లా జరగకపోవచ్చు కానీ అలాంటి పరిస్థితి వస్తే గందరగోళం ఏర్పడుతుంది. ఈ కండిషన్​ ఫలితంగా ఒక న్యాయమూర్తి నియామక బాధ్యత పాక్షికంగా రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి నుంచి ఎన్‌జెఎసి సభ్యులకు బదిలీ అవుతుంది.

‘99వ సవరణ చట్టం-2014 రాజ్యాంగ విరుద్ధం. అది చెల్లదు. అలాగే ఎన్‌జెఎసి కూడా చెల్లుబాటుకాదు. ఈ చట్టానికి ముందున్న కొలీజియం వ్యవస్థ మరింత మెరుగైన పనితీరుపై ప్రభుత్వం నుంచి ఏవైనా సూచనలు వస్తే వాటిని పరిగణించే విషయాన్ని తదుపరి విచారణలో పరిశీలిస్తాం’ అని జెస్టిస్‌ జె.ఎస్‌. ఖేహార్‌, జస్టిస్‌ ఎం.బి.లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌, జస్టిస్‌ జె.చలమేశ్వర్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరించింది. అంతేకాకుండా ‘ఈ కేసుని విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలన్న విజ్ఞప్తిని, కొలీజియం వ్యవస్థను ఆమోదించిన 1993, 1998 నాటి కేసులను తిరిగి పరిశీలించాలని చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాం’ అని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత, పార్లమెంట్‌ సార్వభౌమాధికారం, కొలీజియం వ్యవస్థ, జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ మొదలైన వాటిపై లోతైన పరిశీలన చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

- Advertisement -

సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకం..- కొలీజియం వ్యవస్థ

భారతదేశ స్వాతంత్ర్యానికి పూర్వం దేశంలో ఫెడరల్‌ కోర్టు ఉండేది. అయితే స్వాతంత్రానంతరం 1950 జనవరి 26 నుంచి సుప్రీంకోర్టు ఏర్పడింది. రాజ్యాంగంలోని 124 నుంచి 147 వరకు గల అధికరణలు సుప్రీంకోర్టు ఏర్పాటు, నిర్మాణం, అధికార పరిధి, 214 నుంచి 231 వరకు గల అధికరణలు హైకోర్టుల నిర్మాణం గురించి చెబుతున్నాయి. 124 అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే సమయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి. 217 అధికరణ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను నియమించే సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమార్తి, ఆ రాష్ట్ర గవర్నర్‌, ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాను రాష్ట్రపతి తీసుకుంటారు.

222 అధికరణ ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఇతర న్యాయమూర్తుల బదిలీల విషయంలో కూడా రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తారు. అంటే ఉన్నత న్యాయస్థానాల్లోని న్యాయమూర్తుల నియామకం, బదిలీల ప్రక్రియలో న్యాయ వ్యవస్థతో పాటు కార్యనిర్వాహక శాఖకు కూడా తగిన ప్రాధాన్యం ఉండేది. కాలక్రమేణా న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరుగుతూ వచ్చింది. 1976లో ఈ జోక్యం విపరీత పోకడలకు దారి తీసింది. దాన్ని నివారించడానికి 1981లో ఎస్‌.పి.గుప్తా సుప్రీంకోర్టులో ఒక కేసు వేసి, కార్యనిర్వాహక శాఖ అధికారాన్ని (న్యాయమూర్తుల నియామకంలో) ప్రశ్నించారు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ జడ్జీల నియామకంలో రాష్ట్రపతి మిగిలినవారిని సంప్రదించడం అనేది కేవలం సంప్రదాయం అనీ, కార్యనిర్వాహక శాఖకే పూర్తి అధికారం ఉంటుందని పేర్కొంది. కొన్ని బలమైన కారణాలతో రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి సలహాను కూడా తిరస్కరించవచ్చని చెప్పింది. దీంతో న్యాయశాఖాధికారంపై కార్యనిర్వాహకశాఖ ఆధిపత్యం కొనసాగింది. ఈ కేసునే ప్రముఖంగా మొదటి జడ్జస్‌ కేసుగా పరిగణించారు.

ఆ తర్వాత 1993లో(రెండో జడ్జస్‌ కేసు) సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్స్‌ అసోసియేషన్‌, యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో జస్టిస్‌ జె.ఎస్‌. వర్మ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులు ఉన్న ధర్మాసనం మొదటిసారిగా కొలీజియం వ్యవస్థ గురించి పేర్కొంది. ఈ తీర్పులో రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తిని ‘సంప్రదించడం’ అంటే న్యాయమూర్తి ‘ఒప్పుకోవడం’ అని నూతన భాష్యం చెప్పింది. ఈ తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు, హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. అయితే సలహా ఇచ్చే విషయంలో కేవలం ప్రధాన న్యాయమూర్తే కాకుండా, అతనితో కలిపి మరో ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం వ్యవస్థ రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని తెలిపింది.

అయితే.. కొన్ని సందర్భాల్లో భారత ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను సంప్రదించకుండానే తన సలహాను రాష్ట్రపతికి తెలియజేస్తారు. దీనిపై అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణ్‌ 143 అధికరణను అనుసరించి న్యాయమూర్తుల నియామకం, బదిలీల అంశంలో భారత ప్రధాన న్యాయమూర్తికి ఉన్న ‘సంప్రదింపు’ అనే అంశం గురించి అర్థవివరణ ఇవ్వాలని(మూడో జడ్జిస్‌ కేసు) సుప్రీంకోర్టును కోరారు. అంటే సంప్రదింపునకు అర్థం భారత ప్రధాన న్యాయమూర్తి సలహాను మాత్రమే గ్రహించాలా? లేదా ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఇతర న్యాయమూర్తుల సూచనలను కూడా పరిగణించాలా? అనే అంశంపై వివరణ అడిగారు. దానికి సుప్రీంకోర్టు విస్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించి, రాష్ట్రపతికి తెలియజేసింది.

  • సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి, నలుగురు ఇతర సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తుల సలహాను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో ఇద్దరు సీనియర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సలహాను తప్పనిసరిగా పాటించాలి. దీనినే కొలీజియం వ్యవస్థగా పరిగణించారు.
  • భారత ప్రధాన న్యాయమూర్తి, నలుగురు ఇతర సీనియర్‌ న్యాయమూర్తుల సూచనలను కూడా తీసుకుని, తన సూచనలు జోడించి తుది నిర్ణయాలను భారత ప్రభుత్వానికి రాతపూర్వకంగా అందించాలి.
  • న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి స్వతంత్రంగా వ్యక్తిగత సామర్థ్యాలకు అనుగుణంగా వ్యవహరించాడానికి వీలు లేదు. అతను తప్పనిసరిగా కొలీజియం వ్యవస్థలోని ఇతర నలుగురు న్యాయమూర్తుల సలహాను కూడా పాటించాలి.
  • సంప్రదింపుల ప్రక్రియలోని నిబంధనలను పాటించకుండా భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన సిఫార్సులకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. 
Advertisement

తాజా వార్తలు

Advertisement