ఉత్తరాదిన చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. రాబోయే రెండు రోజుల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్రమైన చలిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. తాజా సమాచారం ప్రకారం.. జనవరి 21 నుండి వాయువ్య భారతదేశాన్ని కూడా చలిగాలలు ప్రభావితం చేయనున్నట్టు IMD తెలిపింది.
ఇదిలా ఉండగా, ఆదివారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది, గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీ, ఉత్తర భారతంలో చలి వాతావరణం నెలకొనడంతో ఢిల్లీలో పొగమంచు కమ్ముకుంది. కనుచూపు మేరలో ఏమున్నదో కనిపించకపోవడంతో ఢిల్లీకి వెళ్లే అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.