తెలంగాణపై చలిపులి మరోసారి పంజా విసురుతోంది. చలి తీవ్రతతో తెలంగాణ గజగజ వణుకుతోంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో రాత్రి పూట చిలి తీవ్రత మరింత పెరిగింది. ప్రజలు ఇళ్ల బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 11 గంటలు కానిదే చలి తగ్గడం లేదు. తెలంగాణలోని 9 జిల్లాలో గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆయా జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లా అర్లీ(టీ) లో అత్యల్పంగా 6.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 14.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. రాజేంద్రనగర్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) తెలిపిన సమాచారం ప్రకారం.. సోమవారం నుండి నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రత రెండు నుండి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది.