తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రివేళ ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. తూర్పు, నైరుతి భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తెలో గాలులు వీయడంతో చలి పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెల్లవారుజాము నుంచే పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో రహదారులు కనిపించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ లో అత్యల్పంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) అంచనా ప్రకారం.. రానున్నరోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. నగర శివార్లలోని కాప్రా, హయత్‌నగర్, ఉప్పల్, మలక్‌పేట్, ఫలక్‌నుమా వంటి ప్రాంతాల్లో మంగళ, బుధ, గురువారాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టవచ్చని వాతావరణ అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్ లో రాత్రి ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. చలిగాలుల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
మరోవైపు రానున్న రెండు రోజుల్లో మేడ్చల్- మల్కాజిగిరి, నిర్మల్, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital